పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పట్టు పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రూ.1,500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ఆయన.. రాష్ట్రానికే వన్నె తెచ్చిన పట్టు పరిశ్రమను మాత్రం పట్టించుకోవడం లేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు. కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం సంగతి అలా ఉంచితే గతంలో స్వయంగా ఆయనే సిల్క్ సిటీగా చేస్తానంటూ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం నేరుగా కలసి, తమ బాధలు చెప్పుకుందామనుకున్నా.. పవన్ ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం లేక.. ధర రాక..
‘పట్టు’కుంటే బంగారం అనేది ఒకప్పటి మాట. పట్టును ముట్టుకుంటే మట్టే అనేది ఇప్పటి రైతుల మాట. రైతులను అపర కుబేరులుగా చేసిన పట్టు సాగు ఇప్పుడు వారిని నట్టేట ముంచుతోంది. స్వదేశీ సిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే కీలక పాత్ర వహించిన గొల్లప్రోలు మండలంలో పట్టు పంటకు గడ్డు కాలం మొదలైంది. దుక్కి దున్ని పంట సాగు చేసుకునే రైతులు.. ఇప్పుడు పంటనే దున్నేసే పరిస్థితి దాపురించింది. పట్టు సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు సర్కారు నామం పెట్టింది. దీనికి తోడు పంట కొనే వారు లేక.. సరైన ధర రాక.. పెట్టుబడి రాక.. కనీసం కౌలుకు తీసుకునే వారు కూడా ఉత్సాహం చూపక.. షెడ్ల నిర్వహణ భారమై.. రూ.లక్షల్లో నష్టాలు వస్తాయనే ఆందోళనతో పట్టు రైతులు మల్బరీ సాగుకు నిరాకరిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో రెండేళ్లుగా మల్బరీ సాగు పూర్తిగా పడిపోయింది. సుమారు 3 వేల ఎకరాల్లో సాగయ్యే ఈ పంట నేడు కేవలం 200 ఎకరాలకు పరిమితమైంది.
గతంలో ఊజీ ఈగ దాడితో పాటు వివిధ రకాల తెగుళ్లతో పట్టు పురుగులు గూళ్లు కట్టక, సాగు తీవ్రంగా దెబ్బ తింది. రైతులు ఆందోళన చెందడంతో శాస్త్రవేత్తలు పంటను పరిశీలించారు. పక్కనే ఉన్న పంటలకు పురుగు మందులు వాడటం వల్ల పట్టు పురుగులు చనిపోతున్నాయని చెప్పి చేతులు దులిపేసుకున్నారని రైతులు విమర్శిస్తున్నారు. పంట నష్టాలకు కారణమైన అసలు తెగులు నివారణపై అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేకపోయారు. వీటన్నింటి ఫలితంగా నష్టాల పాలయ్యి మల్బరీ సాగు మానేసే దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
కల్యాణ్ మండపం ఎక్కడ?
ఇదిలా ఉండగా ఉప్పాడ కొత్తపల్లిలో శివాలయం పక్కన రూ.2 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి పవన్ కల్యాణ్ గత ఏడాది ఏప్రిల్ 25న ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం కోసం దేవదాయ శాఖ అధికారులు ఆగమేఘాల మీద దాత ఇచ్చిన స్థలాన్ని చదును చేసి, సిద్ధం చేశారు. తక్కువ ఖర్చుతో పెద్ద కల్యాణ మండపంలో నిరుపేదలు సైతం శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మిస్తున్నామని అప్పట్లో పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ, దీని పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయినప్పటికీ రూ.2 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం చేపట్టినట్లు జనసేన నేతలు చెప్పుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఆ స్థలాన్ని వాహనాల పార్కింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి శంకుస్థాన చేసిన పనికే గతి లేకపోతే ఇక రాష్ట్రం ఎలా అభివృద్ధి సాధిస్తుందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
సిల్క్ సిటీ ఎక్కడ?
‘మీకు అండగా ఉంటా.. పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా.. సిల్క్ సిటీ నిర్మిస్తా’ అంటూ ఎన్నికల ముందు చేబ్రోలు వచ్చిన పవన్ కల్యాణ్.. ఇక్కడి పట్టు రైతులకు పాన్ ఇండియా సినిమా చూపించారు. పదవి వచ్చాక అండగా ఉంటానన్నారు. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించిన తరువాత ఇప్పుడు పట్టు రైతుల రంగుల కల కరిగిపోతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆయన ఏమీ పట్టించుకోకపోవడంతో పట్టు పరిశ్రమ మూతపడే స్థాయికి పరిస్థితులు దిగజారాయి.
ఫ పవన్ ఇలాకాలో
పట్టు పరిశ్రమకు గడ్డు కాలం
ఫ నెరవేరని సిల్క్ సిటీ హామీ
ఫ శంకుస్థాపనకే పరిమితమైన
టీటీడీ కల్యాణ మండపం


