సామర్లకోట: కాకినాడలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను సోమవారం ఆయన పత్రికలకు విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనంపై నిత్యం మాట్లాడే పవన్ దృష్టికి డీసీసీ అక్రమాలను తీసుకు వచ్చేందుకే ఈ లేఖ రాస్తుస్తున్నామని తెలిపారు. డీసీసీబీ రూ.327 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. దీనికితోడు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) సుమారు రూ.700 కోట్లకు చేరాయని, ఇవి ఏకంగా రూ.1,500 కోట్లకు చేరే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకును కాపాడాల్సింది పోయి, నిబంధనలకు విరుద్ధంగా వేతనాలు ఏవిధంగా పెంచుతారని ప్రశ్నించారు. బ్యాంకు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేతనాల పెంపు సరికాదంటూ అపెక్స్ బ్యాంకులైన నాబార్డు, ఆప్కాబ్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వేతనాలు పెంచడం వల్ల బ్యాంకుపై నెలకు రూ.75 లక్షలు, 3 నెలలకు గాను ఏకంగా రూ.2.25 కోట్ల మేర అదనపు భారం పడుతుందని దొరబాబు తెలిపారు. పెంచిన వేతనాల మొత్తాన్ని 320 మంది ఉద్యోగుల నుంచి ఒకేసారి నగదు రూపంలో ఎందుకు వసూలు చేశారని, ఎవరి ఆదేశాలతో ఉద్యోగుల నుంచి బలవంతంగా సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలు తీసుకున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ పరిధిలోని 52 శాఖల, 320 మంది ఉద్యోగులకు సంబంధించి ఒకే రోజు జరిగిన నగదు లావాదేవీలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. వేతనాల పెంపునకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన వేతనాలు, హక్కులు అందాలనే కోరుతున్నామని తెలిపారు. కానీ, వేతనాల పెంపు పేరుతో ఉద్యోగులకు చెల్లించిన మొత్తాలను వారి నుంచి బలవంతంగా తిరిగి వసూలు చేయడాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. జనసేనకు చెందిన తుమ్మల బాబు చైర్మన్‌గా ఉన్న డీసీసీబీలో జరిగిన ఈ అక్రమాలపై సిట్ లేదా సీబీఐ విచారణకు సిఫారసు చేసి, ప్రభుత్వ పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిరూపించుకోవాలని పవన్ కల్యాణ్‌ను దొరబాబు డిమాండ్ చేశారు.
ఫ జీతాలు ఎందుకు పెంచారు?
ఫ ఎందుకు రికవరీ చేశారు?
ఫ డిప్యూటీ సీఎంకు దొరబాబు బహిరంగ లేఖ


