సాధిక్‌ఖాన్‌ కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ | - | Sakshi
Sakshi News home page

సాధిక్‌ఖాన్‌ కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

కాకినాడ లీగల్‌: సాధిక్‌ఖాన్‌ను మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో సర్పవరం పోలీసులు ఈ నెల 15న దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. కస్టడీ పిటిషన్‌పై సాధిక్‌ఖాన్‌ తరఫు న్యాయవాది సోమవారం కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. దీంతో, విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితుడైన షేక్‌ సాధిక్‌ ఖాన్‌ను అదనపు విచారణ కోసం మరోసారి ఐదు రోజుల కస్టడికి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాధిక్‌ ఖాన్‌ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్నారు.

సామాన్యులపై ధరల భారం

పిఠాపురం: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉల్లిపాయలు, బియ్యం, పంచదార, వంటనూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడంతో సామాన్య కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం మాట అటుంచి, రోజువారీ ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా, 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ ఇస్తామన్న హామీ అమలు చేయలేదని ఆమె విమర్శించారు. కొత్త పెన్షన్ల మంజూరులో అనేక ఆంక్షలు విధించడం వల్ల అర్హులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అర్హత ఉన్న వితంతు మహిళలకు వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌ వ్యవస్థలో పేదలకు అందే ప్రయోజనాలపై కోతలు విధించడం సరి కాదని, పేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహిళల సంక్షేమం, కుటుంబ ఆర్థిక భద్రత విషయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలే ఈ కూటమికి తగిన గుణపాఠం చెబుతారని సుజాత అన్నారు.

వారాహి ఆలయ

స్వాధీనం తగదు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కరప మండలం కొరుపల్లిలో చిక్కాల వీర వెంకట సత్యనారాయణ (దొరబాబు) సొంత నిధులతో నిర్మించిన కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం తగదని పేర్కొంటూ కాకినాడ సిటీ, రూరల్‌, పెదపూడి మండలాలకు చెందిన మహిళా భక్తులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఒక అన్య మతస్తుడు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో ఈ ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం తగదని వారు నినాదాలు చేశారు. గత 26 ఏళ్లుగా దొరబాబు సొంత నిధులతో తన గ్రామంలో ఆలయాలు నిర్మించి, ఉత్సవాలు చేయడమే కాకుండా అన్న సమారాధనతో పాటు మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు కూడా అందించారని వారు గుర్తు చేశారు. అన్య మతస్తులు ఇచ్చిన ఫిర్యాదు వెనుక ఎవరున్నారో విచారణ చేసి, ఆలయాన్ని తిరిగి దొరబాబుకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కార్యాలయంలో కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో పిఠాపురంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వద్దకు వెళ్లి, వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయత్నించారు. అయితే, వారి బస్సును పోలీసులు అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా భక్తులు దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యను తెలియజేయడానికి దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ రమేష్‌బాబు వద్దకు తాము వెళ్లగా ఆయన దురుసుగా సమాధానం ఇచ్చారని దొరబాబు, ఇతర మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement