భారీ వర్షాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలపై అప్రమత్తం

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

కాకినాడ లీగల్‌: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతూ దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కాకినాడ నగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ సోమవారం సమీక్ష నిర్వహించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ముంపు లేకుండా చర్యలు చేపట్టాలని, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీప ప్రాంతం, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డు, దుమ్ములపేట రైల్వే ట్రాక్‌ ప్రాంతం, దాల్మిల్‌ ఏరియా, తిలక్‌ వీధి, సినిమా రోడ్డు, భానుగుడి జంక్షన్‌తో పాటు ఇతర లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని శానిటేషన్‌, ఇంజినీరింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. ముంపు నీటిని వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, మంచానికే పరిమితమైన రోగులను ముందుగానే గుర్తించి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. మంచినీటి సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్‌ శాఖతో సమన్వయం చేసుకోవాలని, కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక, పోలీస్‌, వైద్య, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. నగర పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ ఆదేశించారు. సమీక్షలో అదనపు కమిషనర్‌ కేటీ సుధాకర్‌, తహసీల్దార్‌ జితేంద్ర, ఆరోగ్య అధికారి డాక్టర్‌ పృథ్వీచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ లోతట్టు ప్రాంతాలపై

కాకినాడ నగర యంత్రాంగం దృష్టి

ఫ అత్యవసర సిబ్బందిని సిద్ధంగా

ఉంచాలని కమిషనర్‌ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement