సాధిక్‌ఖాన్‌ కస్టడీ పిటిషన్‌పై 25న విచారణ | - | Sakshi
Sakshi News home page

సాధిక్‌ఖాన్‌ కస్టడీ పిటిషన్‌పై 25న విచారణ

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

కాకినాడ లీగల్‌: సాధిక్‌ఖాన్‌ను మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) వాయిదా కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ మేరకు విచారణను న్యాయమూర్తి ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితుడైన షేక్‌ సాధిక్‌ ఖాన్‌ను అదనపు విచారణ కోసం మరోసారి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు ఈ నెల 15న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాధిక్‌ఖాన్‌ ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్నాడు.

సముద్ర మంథన్‌కు

స్థల పరిశీలన

తొండంగి: దేశంలో ఆఫ్‌షోర్‌(సముద్రం)లో చమురు, సహజవాయువు అన్వేషణను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన సముద్ర మంథన్‌ స్కీమ్‌లో భాగంగా కాకినాడ గేట్‌వే పోర్ట్‌ (కేజీపీఎల్‌), కాకినాడ సెజ్‌ ప్రాంతాన్ని అధికారులు మంగళవారం పరిశీలించారు. కేజీపీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామ్‌రెడ్డి ఓజిలి, కాకినాడ సెజ్‌ హెడ్‌ మంథా శ్రీనివాస్‌తో కలసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ పరిశీలన చేపట్టారు. గేట్‌ వే పోర్టు వద్ద మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, భూమి లభ్యతపై అధికారులు సమాచారం అందించారు. ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి సహకారం అందిస్తామని కేజీపీఎల్‌ ప్రతినిధులు చెప్పారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సముద్ర మంథన్‌ స్కీమ్‌ వల్ల దేశంలో చమురు, సహజవాయువు నిల్వల అన్వేషణ మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు.

పులస @ రూ.26 వేలు

యానాం: పుస్తెలు అమ్మి అయినా పులస చేప తినాలనే నానుడి గోదావరి జిల్లాల్లో అనాదిగా ఉంది. కానీ, ప్రస్తుతం పుస్తెలు అమ్మితే వచ్చే సొమ్ము కూడా సరిపోని రీతిలో వీటి ధరలు పలుకుతున్నాయి. యానాం వద్ద గౌతమీ గోదావరిలో మంగళవారం మత్స్యకారుల వలకు చిక్కిన పులసకు రూ.26 వేల అత్యధిక ధర పలికింది. స్థానిక పుష్కర ఘాట్‌ వద్ద నిర్వహించిన వేలం పాటలో ఈ చేపను కోటిపల్లికి చెందిన మత్స్యకారుడు రూ.26 వేలకు దక్కించుకుని, తిరిగి మరో వ్యక్తికి రూ.27 వేలకు విక్రయించాడు. ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన పులస ఇదే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement