వాయుగండం | - | Sakshi
Sakshi News home page

వాయుగండం

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

కాకినాడ రూరల్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వాతావరణం చల్లబడింది. జిల్లాలో మంగళవారం రోజంతా చిరుజల్లులు కురిశాయి. వాయుగుండం బుధ, గురువారాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో చేపల వేటకు వెళ్లవద్దంటూ మత్స్యకారులను ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో చేపల వేటలో ఉన్న బోట్లు ఒక్కొక్కటిగా తీరానికి చేరుతున్నాయి. కాకినాడ కుంభాభిషేకం రేవు, ఫిషింగ్‌ హార్బర్‌, జగన్నాథపురం ఏటిమొగ వద్ద భారీ సంఖ్యలో బోట్లు చేరుకున్నాయి. సముద్ర లోతు జలాల్లో ఉన్న బోట్లలోని మత్స్యకారులకు అధికారులు తుపాను హెచ్చరికలు జారీ చేసి, సమీపంలోని విశాఖ, పారాదీప్‌ వంటి రేవులకు క్షేమంగా చేరుకోవాలని సూచించారు. సముద్రంలో సుమారు 33 బోట్లు ఉన్నట్లు గుర్తించామని, అందులోని మత్స్యకారులను సమీప తీరానికి చేరుకోవాల్సిందిగా సూచించామని జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. ఒడిశాలోని పారాదీప్‌, గోపాల్‌పూర్‌ వద్ద 10 బోట్లు లంగరు వేశాయన్నారు. వాయుగుండం ఈ నెల 25న శ్రీకాకుళం – కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తూండటంతో మత్స్యకారులను అప్రమత్తం చేశామని చెప్పారు.

అప్రమత్తంగా ఉండాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రానున్న మూడు రోజుల పాటు జిల్లాకు భారీ వర్షాలు, తుపాను ముప్పు ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ నుంచి మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా తుపాను సన్నాహక సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయి అధికారులు, మండల, జిల్లా స్థాయి అధికారులు వారి ప్రధాన కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఇసుక కొరత లేకుండా చూడాలని, అవసరమైన చోట్లకు ఇసుకను తరలించడానికి నిల్వ పాయింట్లను, ఇసుక సంచులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. గండి పడే అవకాశం ఉన్న కాలువ, చెరువు గట్లను ముందుగానే గుర్తించి బలోపేతం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున నదులు, చెరువులు, వాగుల వద్ద నీటిమట్టం పెరగవచ్చని, ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈపీడీసీఎల్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రులు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా జనరేటర్లు, డీజిల్‌, విద్యుత్‌ స్తంభాలు, గ్యాంగ్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము

వాయుగుండం నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24 గంటలూ పని చేసేలా కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. వరదలు, చెట్లు పడిపోవడం, రహదారులపై ఆటంకాల వంటి పరిస్థితుల్లో కంట్రోల్‌ రూముకు 0884–23568012 లేదా 98499 03879 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

భక్తులు జాగ్రత్తగా ఉండాలి

వినాయక చవితి నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా బుధ, గురువారాల్లో గణపతి విగ్రహాల నిమజ్జనాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఎక్కువగా గురువారం నిమజ్జనాలు అధికంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాకినాడ, పరిసర గ్రామాలతో పాటు పిఠాపురం, సామర్లకోట, తదితర ప్రాంతాల నుంచి వచ్చే భారీ విగ్రహాలను కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట బీచ్‌లో నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకోసం ఫ్లడ్‌లైట్లు, రోడ్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. వాయుగుండం ప్రభావంతో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున్న ఎగసి పడే అవకాశం ఉన్నందున నిమజ్జనం కోసం వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆ మేరకు భక్తులు సాగర జలాల్లోకి దిగకుండా అధికారులు కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.

ఫ ఒడ్డుకు చేరుతున్న మత్స్యకార బోట్లు

ఫ నేడు, రేపు భారీ వర్షాలు

కురుస్తాయని హెచ్చరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement