● కళావిహీనమైన రథంలోనే
సత్యదేవుని ఊరేగింపు!
● కొత్త రథం చేయించడంలో
అధికారుల అలసత్వం
అన్నవరం: స్వామివారి జయంత్యుత్సవాలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి కానీ దేవేరులతో ఆయన ఊరేగడానికి వెండి రథాన్ని బాగుచేయించడానికి మాత్రం చేయించడానికి అధికారులకు తీరిక దొరకడం లేదు. ప్రస్తుతం ఊరేగుతున్నది 50 క్రితం నాటిది, జీర్ణావస్థకు చేరినప్పటికీ దానినే ఉత్సవాలకు వినియోగించడం శోచనీయం. ఈ రథం స్థానంలో స్వామి ఊరేగింపునకు 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ రెండు టేకు రథాలను చేయించారు. చిన్న రథాన్ని కొండపైన ఉత్సవాలకు తిప్పడానికి, రెండో పెద్ద రథాన్ని కొండ కింద తిప్పడానికి ఉద్దేశించారు. చిన్నరథానికే వెండి తాపడం చేయించాలని నిర్ణయించారు. అయితే ఆయన బదిలీతో ఆ ప్రతిపాదన ఆగిపోగా ఆ రథాన్ని మాత్రం నేడు పర్వదినాల్లో స్వామి సేవకు వినియోగిస్తున్నారు. తాజాగా ఆనవాయితీ ప్రకారం జయంత్య్త్సువాలకు వెండి రథాన్నే వినియోగిస్తుండడంతో దానిని తూర్పు రాజగోపురం ముందు ప్రాకారంలోకి తీసుకువచ్చి సిద్ధం చేస్తున్నారు.
అపచారాన్ని మన్నించు దేవా
స్వామివారి ఊరేగింపునకు తీసుకువచ్చిన రథాన్ని చూస్తే కడుపు తరుక్కుపోక మానదు. రథంపై సుదర్శన చక్రం ఒరిగిపోయి, మువ్వలు సగానికి పైగా రాలిపోయి, అరటి చెట్లు, ఆకులు తాళ్లతో కట్టబడి, మకర తోరణాలు అస్తవ్యస్తంగా తయారై, వెండి తాపడాల అతుకులు ఊడిపోయి చెక్కలు కనిపిస్తూ, రథ చక్రాలు ఊడిపోయి అధ్వానంగా ఉన్న రథాన్ని నేడు స్వామివారి సేవకు వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించే బృహత్కార్యానికై నా కొత్త రథాన్ని స్వామివారికి అమరుస్తారో లేదో వేచి చూడాల్సిందే.


