సత్యదేవుని జయంత్యుత్సవాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని జయంత్యుత్సవాలకు శ్రీకారం

Aug 14 2026 7:38 AM | Updated on Aug 14 2026 7:38 AM

వేద ఘోషతో మార్మోగిన రత్నగిరి

నేడు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం

అన్నవరం: రత్నగిరీశుడు సత్యదేవుని 135వ సత్యవిదియ (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు శ్రావణ శుద్ధ పాడ్యమి, గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నిర్వహించనున్న ఈ వేడుకను పురస్కరించుకుని ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వరపూజతో జయంత్యుత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పండితుల వేదాశీస్సులు అందజేసి ప్రసాదాలు నివేదించారు. ఈ సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ రెండు రోజుల పాటు జపతపాలు చేసే 50 మంది రుత్విక్కులకు దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్య చక్రధరరావు దీక్షా వస్త్రాలను అందజేశారు. రుత్విక్కుల వేద మంత్రాలతో అనివేటి మండపం, ఆలయ ప్రాంగణం మార్మోగాయి. ఈ సందర్భంగా సూర్యనమస్కారాలు, లింగాష్టకం, నవావరణ అర్చన, రామాయణ, భాగవతాల పారాయణ, శ్రీసూక్త, పురుష సూక్త పారాయణ, బాల, కౌమారీ, సువాసిని పూజలు నిర్వహించారు. సాయంత్రం దర్బారు మండపంలో మండపారాధన, కలశస్థాపన ఆయుష్యహోమానికి అంకురార్పణ నిర్వహించారు. ఆస్థాన వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, శివ ఘనపాఠీ, గొల్లపల్లి ఘనపాఠీ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, రమేష్‌, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని సత్యదేవుని ఆలయం, రాజగోపురాలు, రామాలయం, ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

నేడు ప్రత్యేక పూజలు

సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. అలాగే పలువురు వేద పండితులను సత్కరించనున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఊరేగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement