అన్నవరం: ఈ నెల 20న తన కార్యాలయంలో అన్నవరం దేవస్థానం ప్రథమ శ్రేణి వ్రత పురోహితుడు మల్లాది గురుమూర్తి విచారణకు హాజరు కావాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ కమిషనర్ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్ 21 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సత్యదేవుని సామూహిక వ్రతాల నిర్వహణకు వెళ్లిన సందర్భంలో ఆయన వ్యవహార శైలిపై ఫిర్యాదులు రావడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, ఆ తరువాత గత నెల 24న ఆ చర్యలను రద్దు చేస్తూ ట్రస్ట్ బోర్డు తీర్మానం చేయడం తెలిసిందే. దీంతో జూలై 3న ‘ఒట్టి అమాయకుడు గురూ’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో ఆ తీర్మానాన్ని కమిషనర్ సస్పెండ్ చేశారు. దీనిపై గత నెల 29న విచారణకు రావాలని ఆదేశించారు. వ్యక్తిగత కారణాలతో రాలేనని గురుమూర్తి చెప్పడంతో వాయిదా వేశారు. తాజాగా దీనికి సంబంధించిన రికార్డులతో ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని గురుమూర్తితో పాటు ఈఓను కమిషనర్ ఆదేశించారు.


