ఇలా సర్ద్‌బాటు చేసి.. | - | Sakshi
Sakshi News home page

ఇలా సర్ద్‌బాటు చేసి..

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

అంతా అయోమయం

జిల్లాలో పునర్విభజన అనంతరం పెరిగిన, మారిన పోలింగ్‌ కేంద్రాలపై నాయకుల్లో అయోమయం నెలకొంది. ఏ పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉంది. కొత్తగా వచ్చిన పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనేది ఇంకా స్పష్టత లేకపోవడంతో పోలింగ్‌ కేంద్రాలపై నాయకులు, ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. అలాగే ఓటర్లలోనూ అయోమయం నెలకొంది.

జిల్లాలో తగ్గిన ఓటర్లు

పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు

పిఠాపురం: సాధారణంగా ఓటర్లు తగ్గితే, పోలింగ్‌ కేంద్రాలు తగ్గుతాయనేది అందరూ భావిస్తుంటారు. కానీ ప్రస్తుత సవరణ అనంతరం ఓటర్లు తగ్గగా, పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి. అలా ఎందుకు జరిగిందంటే ఇప్పటి వరకు పరిమితికి మించి ఓటర్లు పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఉండగా, ప్రస్తుతం ఎన్నిక సంఘం నిబంధనల మేరకు వాటిని హేతుబద్ధీకరణ చేశామని అధికారులు చెబుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా 2025 ఓటరు జాబితా ప్రకారం 1200 మందికి పైగా ఓటర్లున్న కేంద్రాలను మాత్రమే పునర్‌ వ్యవస్థీకరించే ప్రతిపాదన ఉంది. మరణించిన, చిరునామా మారిన ఓట్ల తొలగింపు అనంతరం మిగిలే తుది ఓట్ల సంఖ్య ఆధారంగా అవసరమైన చోట్ల మాత్రమే సర్దుబాటు ఉంటుంది. సర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. జిల్లాలో 1,640 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ప్రస్తుత సవరణ తర్వాత అవి 1,822కు పెరిగాయి. ఈ లెక్కన పోలింగ్‌ కేంద్రాలపై కూడా ప్రభావం పడనుంది. పదుల సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలు పెరగడంతో సాధారణ ఎన్నికలు మొదలుకుని స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఫలితాలపై ప్రభావం చూపుతుందని, ఇప్పటికే పలువురు నాయకుల్లో టెన్షన్‌ మొదలైంది.

ఎక్కడెక్కడ ఎలా అంటే..

జిల్లాలో తుని నియోజకవర్గంలో 21,141 ఓట్లు తగ్గాయి. అక్కడ మొత్తం 224 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ప్రస్తుత సవరణ తర్వాత అవి 265కు పెరిగాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 19,873 ఓట్లు తగ్గగా.. 227 పోలింగ్‌ కేంద్రాలకు 247కు పెరిగాయి. పిఠాపురం నియోజకవర్గంలో 19,879 ఓట్లు తగ్గగా.. 242 పోలింగ్‌ కేంద్రాలకు ప్రస్తుత సవరణ తర్వాత అవి 266కు చేరాయి. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో 43,399 ఓట్లు తగ్గగా.. 254 పోలింగ్‌ కేంద్రాలకు 281కు పెరిగాయి. పెద్దాపురం నియోజకవర్గంలో 21,605 ఓట్లు తగ్గగా.. 201 పోలింగ్‌ కేంద్రాలకు 238కు చేరాయి. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 49,400 ఓట్లు తగ్గగా, 234 పోలింగ్‌ కేంద్రాలకు 261కు పెరిగాయి. జగ్గంపేట నియోజకవర్గంలో 20,305 ఓట్లు తగ్గగా.. 248 పోలింగ్‌ కేంద్రాలకు 264కు చేరాయి.

పెరగనున్న ఎన్నికల వ్యయం

గత మే 26వ తేదీ నాటికి జిల్లాలో 16,50,811 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతానికి సవరణ తరువాత 14,55,209 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. 1,95,602 మంది ఓటర్లు తగ్గనున్నట్లు చూపిస్తుండగా.. వీటిలో మృతులు 66,754 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 73,400 మంది, రెండుకు పైగా ఓట్లున్న వారు 55,448 మంది ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం పెరిగిన పోలింగ్‌ కేంద్రాల వల్ల పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల నిర్వహణా వ్యయం భారీగా పెరగనుంది. గతంలో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 1,500కు పైగా ఓట్లు ఉండడంతో పోలింగ్‌ సమయం ముగిసే వరకు ఓటర్లు బారులు తీరి ఉండే వారు. ప్రస్తుతం ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు 1,200 మంది మాత్రమే ఓటర్లు ఉండేలా చూడడంతో ఎన్నికల ప్రక్రియ సమయానికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement