బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సాగునీటి సమస్యలపై రైతులు కంట్రోల్ రూమ్ నంబర్ 98499 03879కు ఫోన్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శనివారం క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు ఆయకట్టు కింద సాగునీటి పంపిణీకి వంతుల వారీ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సాగునీటి పంపిణీ పటిష్టంగా అమలయ్యేలా రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వీరు నిత్యం పర్యవేక్షణ చేసి, శివారు పంట భూములకు సజావుగా సాగునీరు అందేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులంతా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఎల్‌నినో ప్రభావం, పంటల బీమా నమోదు, రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతు సేవా కేంద్రం స్థాయిలో సాగునీటి సంఘాలు, రైతు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.
జాతీయ సాహస
పురస్కారాలకు దరఖాస్తులు
కాకినాడ రూరల్: యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సాహస కార్యకలాపాలతో యువకులు సత్కరించేందుకు గాను టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం –2025 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. పురస్కారాల కోసం గత మూడేళ్లలో భూమి, సముద్రం, గాలిపై సాహస కార్యకలాపాలలో అత్యుత్తమ విజయాలు సాధించిన వారి నుంచి దరఖాస్తులను ఈనెల 20 లోపు వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు. మరిన్ని వివరాలకు కాకినాడ రూరల్ రమణయ్యపేట ఇండస్ట్రీయల్ ఏరియాలో సెట్రాజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
వైఎస్ జగన్ కృషితోనే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం
అల్లవరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషిని మరుగనపరుస్తూ, క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ చింతా అనురాధ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం వైఎస్ జగన్ దూరదృష్టికి, సంకల్పానికి ప్రతీక అని కొనియాడారు. ఉత్తరాంధ్ర భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని 2023లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ, రూ.1,200 కోట్ల నిధులు, అనుమతులన్నీ వైఎస్ జగన్ హయాంలోనే సాఽధించి నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. భోగాపురం నిర్వాసితులకు పరిహారం ఇవ్వడమే కాకుండా, రూ. 80 కోట్లతో టౌన్‌షిప్‌లను తలపించే విధంగా కాలనీని నిర్మించి ఇచ్చారన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో భోగాపురం విమానాశ్రయానికి కనీసం రోడ్లు వేయలేని దుస్థితి నెలకొందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధిని చంద్రబాబు తన ఖాతాల్లో వేసుకునే ప్రయత్నం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అనురాధ ధ్వజమెత్తారు. విమానాశ్రయాన్ని ప్రారంభించినంత మాత్రాన చరిత్ర మార్చలేరని, పునాది నుంచి నిర్మాణం వరకు ప్రతి కీలక అడుగు వైఎస్ జగన్‌తోనే సాధ్యమైందని తెలిపారు. ఆయన కృషిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అనురాధ అన్నారు.
కేంద్ర మలేరియా బృందం పర్యటన
కొత్తపేట: కేంద్ర మలేరియా బృందం జిల్లాలో పర్యటించింది. మలేరియా కేసుల తీవ్రతను అంచనా వేయడానికి, నిర్దిష్ట జిల్లాలను మలేరియా రహిత ప్రాంతాలుగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక తనిఖీలో భాగంగా ముగ్గురు సభ్యులు పాల్గొన్నారు. మూడేళ్లుగా ఇక్కడ ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని, ‘మలేరియా రహిత‘ జిల్లాగా ప్రకటించాలని జిల్లా అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ధ్రువీకరించడానికి డబ్ల్యూహెచ్‌ఓ నుంచి డాక్టర్ దెబాసిస్ (ఢిల్లీ), ఎయిమ్స్ నుంచి డాక్టర్ అమిత్ (ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్), డీఎంఓ నుంచి డాక్టర్ రియాస్‌కై తా (కేరళ) అనే ముగ్గురు కేంద్ర బృంద సభ్యులు జిల్లా మలేరియా (డీఎంఓ) డాక్టర్ కేఎన్ శ్రీనివాస్‌తో కలిసి జిల్లాలో మూడు రోజుల నుంచి ద్రాక్షారామ, హసన్‌బాద, రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట, ఊబలంక, కాట్రేనికోన పీహెచ్‌సీలు, వెల్‌నెస్ సెంటర్లు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను సందర్శించారు. ఇందులో భాగంగా కొత్తపేట సీహెచ్‌సీలో ఓపీ రికార్డులు, గతంలో మలేరియా కేసుల వివరాలతో పాటు రోగులు చికిత్స పొందుతున్న వార్డులను పరిశీలించి, పలువురు రోగుల అనారోగ్యం గురించి డాక్టర్ హనుమాన్‌ను ఆరా తీశారు. జిల్లా మలేరియా అధికారి (డీఎంఓ) శ్రీనివాస్ తన రక్త నమూనాతో మలేరియా టెస్ట్‌ను ప్రయోతాత్మకంగా చేయించుకోగా.. కేంద్ర బృందం సభ్యులు ఆ విధానాన్ని, రిపోర్టు రావటానికి పట్టిన సమయాన్ని నమోదు చేసుకున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశ కార్యకర్తను పిలిచి మలేరియా కేసులను ఎలా గుర్తిస్తున్నారు? ఏఏ లక్షణాలు ఉంటే మలేరియాగా నిర్థారిస్తారు. నివారణా చర్యలు ఏమిటి? అని ఆరా తీశారు. ఇలా ప్రతీ అంశాన్ని రికార్డు చేసుకున్నారు. ఈ నివేదికను కేంద్రానికి నివేదిస్తామని త్రిసభ్య బృందం సభ్యులు తెలిపారు. వారి వెంట మలేరియా సబ్ యూనిట్ అధికారులు నల్లా వెంకటరామారావు, ఎస్.రాజబాబు, వై.ఆదినారాయణ, అవిడి పీహెచ్‌సీ హెల్త్ అసిస్టెంట్లు వాడ సద్గుణరావు, జీవీ రమణ తదితరులు ఉన్నారు.


