ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వా మివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. సుమా రు 82వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఏడు శనివారాల స్వామివారి దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి వర్షం పడినా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఒక్కరోజు రూ.73.79 లక్షల ఆదాయం వచ్చింది.


