సామర్లకోట: న్యాయమైన డిమాండ్ల సాధనకు నేతన్నలు సోమవారం నుంచి రోడ్డు ఎక్కనున్నారు. ఇందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ బయట చేనేతల ఆత్మ గౌరవ దీక్షకు సమాయత్తమవుతున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్న విజ్ఞప్తులను, ఉద్యమాలను పట్టించుకోకపోవడంతో వారి హక్కుల సాధనకు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ దీక్షలు చేయాలని నిర్ణయించినట్టు పెద్దాపురం పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కట్టా రాజబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే పెద్దాపురం ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు మాట్లాడుతూ చేనేత రంగానికి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, చేనేత వస్త్రాలపై 30 శాతం రిబేటు, సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు ఇవే
● చేనేత సహకార సంఘాలకు ఆప్కో, ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి.
● ఆప్కో చేనేత సహకార సంఘాలకు ముడిసరకు ఇచ్చి పూర్తి స్థాయిలో పని కల్పించాలి.
● సహకార సంఘాల వద్ద ఉన్న వస్త్ర నిల్వలనను ఆప్కో కొనుగోలు చేయాలి.
● చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు నిర్వహింలి.
● ఎన్నికై న ప్రతినిధులు ప్రభుత్వానికి నేతన్నలకు వారధిలా ఉండి సమస్యలు పరిష్కరించాలి.
● ఆప్కో ఎండీ రేఖారాణిని వెంటనే బదిలీ చేయాలి.
● నేటి నుంచి చేనేత ఆత్మ గౌరవ దీక్ష
● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్


