● ఆలస్యమైన మామిడి దిగుబడి
● తుని మామిడికి ఎనలేని డిమాండ్
● ప్రారంభమైన ఎగుమతులు
● ఉమ్మడి జిల్లాలో 15,362 హైక్టార్లలో సాగు
తుని: మండు వేసవికి మధుర ఫలానికి అవినాభావ సంబంధం. ఉష్ణం ఉష్ణేన సీతలే అని వేసవి ఉడుకుకు మామిడిని మితంగా తింటే చలవ చేస్తుందంటారు. అందులోనూ తుని మామిడి అంటే తిని తరించాలంతే అంటారు ఆ ప్రాంత వాసులు. మూడు తరాలుగా మామిడి పండ్ల వ్యాపారం చేస్తూ.. రెండేళ్లుగా విదేశాలకు సైతం ఉద్యానశాఖ ద్వారా ఎగుమతులు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇక్కడి మామిడి రైతులు. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులతో మామిడి దిగుబడులు తగ్గడంతో వ్యాపారం కాస్త తగ్గుతుందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ
ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. తుని సబ్ డివిజన్‌లో 3458 హైక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణ రేఖ, పంచదార కంచి, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లలకు ఎంతో డిమాండ్. గతంలో ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు 60 వేల టన్నులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం దిగుబడి 10,374 టన్నులు ఉందని, ఉద్యానశాఖ అంచనాల ప్రకారం రూ.24 కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని అంచనా. విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్యానశాఖ 3500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది
ఇతర రాష్ట్రాలకు..
ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్య ప్రదేశ్, బీహర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఇక్కడి మామిడిని ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం సువర్ణరేఖ టన్ను రూ.55 వేలు, బంగినపల్లి, రసాలు టన్ను రూ.45 వేలు, తోతాపురి టన్ను రూ.35 వేలు పలుకుతోంది. పండూరు, కొత్తపలి కొబ్బరి రకాల ధర చాలా ఎక్కువగా ఉంది.
ఈ ఏడాది కొంచెం ఆలస్యం
మామిడి ఎగుమతులు ఉగాది నుంచి ప్రారంభం కావాలి. ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడం, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి దగ్గింది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందలేదు. దీంతో ఇక్కడి పండ్లను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది.
– పి.వెంకటరమణ, మామిడి ఎగుమతిదారుడు,తుని.
నేల స్వభావంతో రుచి
తుని ప్రాంతం నేల మామిడికి అనుకూలం. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల ఇక్కడి మామిడికి రంగు, రుచి, వాసన బాగుంటాయి. పండు నాణ్యత కోసం ఫ్రూట్ కవర్ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కట్టాలి. దింతో నాణ్యత, సైజు, రంగు బాగుటుంది. చీడ పీడలు వ్యాపించవు. సబ్ డివిజన్ పరిధిలో 100 హెక్టార్లలో కవర్లు కట్టించాం. ప్రస్తుతం పక్వానికి వచ్చిన 10 రోజుల్లో వీటిని దింపి ఎగుమతి చేస్తారు. మాకు ఉన్న అంచనా ప్రకారం ఏరకమైనా టన్ను రూ.45 వేలు నుంచి 80 వేలు వరకు ధర ఉంటుంది.
– సుజాత, ఉద్యానశాఖ అధికారి,తుని


