● దేవదాయ శాఖ మంత్రి
ఆనం రామనారాయణ రెడ్డి
● రత్నగిరిపై శ్రీసీతారామ సత్రానికి
శంకుస్థాపన
● రూ.11.4 కోట్ల వ్యయంతో
105 గదుల నిర్మాణం
అన్నవరం: వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం రత్నగిరిపై రూ.11.40 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో 105 గదులతో నిర్మించనున్న శ్రీసీతారామ సత్రం మొదటి బ్లాక్‌కు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలసి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.1.3 కోట్ల వ్యయంతో మొదటి ఘాట్ రోడ్డు నుంచి సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన రెండో మెట్ల దారిని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేవదాయ శాఖ తరఫున గోదావరి పుష్కరాలకు రూ.863 కోట్ల వ్యయంతో 715 నిర్మాణ పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్టు చెప్పారు. వాటిలో కాకినాడ జిల్లాలోనే రూ.51.70 కోట్ల వ్యయంతో 43 పనులకు టెండర్లు పిలిచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు. గోదావరి పుష్కరాలపై సోమవారం రాజమహేంద్రవరంలో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిన అధికారులు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక అధికారులుగా నియమితులైనందున వారు వచ్చాక ఈ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ధూప దీప నైవేద్యాలకు రూ.70 కోట్లు
ధూప దీప నైవేద్యాల కింద రాష్ట్రంలో 5,821 గుళ్లకు రూ.70 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి ఆనం తెలిపారు. రూ.200 కోట్ల కామన్ గుడ్ ఫండ్ నిధులతో 194 చిన్న ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఐదువేల భజన మండళ్లకు రూ.700 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సమావేశంలో దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు, దేవదాయశాఖ సీఈ జీవీ శేఖర్, అన్నవరం దేవస్థానం ఈఈలు నూకరత్నం, వి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భోజనంలో సత్యదేవుని ప్రసాదం పెట్టండి
దేవదాయశాఖా మంత్రి ఆనం ఆదేశం
పారిశుధ్యం, వేతన బకాయిలపై ‘పద్మావతి’ సంస్థపై ఆగ్రహం
సాక్షి వరుస కథనాలపై కమిషనర్‌కు సూచనలు
అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు స్వామి వారి గోధుమ నూక ప్రసాదం కూడా పెట్టాలని దేవదాయ, ధర్మదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆదివారం ‘సాక్షి’లో ‘అమాత్యా....మొరాలకించవా..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. సత్యదేవుని అన్నప్రసాద పథకంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని భక్తులు కోరడంపై గతంలో పెట్టిన ప్రసాదాన్ని ఎందుకు తీసేశారని అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు బదులిస్తూ కొందరు వడ్డించిన ప్రసాదాన్ని వదిలేస్తున్నారని వివరించారు. దీనికి మంత్రి మాట్లాడుతూ భక్తులను అడిగే ప్రసాదం పెట్టాలని సూచించారు. వారం రోజుల పాటు భోజనంతో పెట్టి భక్తుల అభిప్రాయాలు కోరాలని, తరువాత స్థానిక ఎమ్మెల్యేతో పథకాన్ని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.
పారిశుధ్యంపైనా..
అలాగే అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ.80 లక్షలు వెచ్చిస్తున్నా అక్కడి అధ్వాన పరిస్థితులపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయడంపైనా మంత్రి స్పందించారు. పద్మావతి సంస్థ పనితీరుపైన, నాసిరకం శానిటరీ మెటీరియల్ పైన, వాషింగ్ మెషీన్ మరమ్మతులపైనా తనిఖీలు చేపట్టి కమిషనర్ రామచంద్రమోహన్‌కు నివేదించాలని ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ శేఖర్‌ను ఆదేశించారు. అలాగే వేతన బకాయిలపై శనివారం ‘సాక్షి’ ‘సత్యదేవా సాపాట్లు కనవా..!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కూడా స్పందిస్తూ సత్వరం వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. కమిషనర్ జోక్యం చేసుకుని ప్రతి నెలా ఐదో తేదీ లోపు కాంట్రాక్టర్ నుంచి బిల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


