పంపాలో నిలువు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

పంపాలో నిలువు దోపిడీ

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన అధికారం అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు వాటాలు వేసుకుని లక్షలు దిగమింగుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పెద్దన్న పాత్ర పోషించిన తుని నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్‌, మట్టి అక్రమ తవ్వకాలు వారికి కాసులు కురిపిస్తున్నాయి. దీని వల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందించే పంపా రిజర్వాయర్‌కు గర్భశోకం మిగులుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి అక్రమంగా తవ్వి రిజర్వాయర్‌ను గుల్ల చేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ పూడిక తీసి వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన గ్రావెల్‌, మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇటుకల బట్టీలకు విక్రయించి రూ.లక్షలు పంచుకుంటున్నారు.

ప్రజాప్రతినిధి కనుసన్నల్లో..

ప్రత్తిపాడు, తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పంపా రిజర్వాయర్‌లో కొంత కాలంగా ఇదే దందా సాగుతున్నా అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. తునికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో నడుస్తోన్న ఈ దందాలో అనుచరులే బినామీలు కావడం గమనార్హం. రిజర్వాయర్‌ పూడికతీత పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్‌, మట్టి తవ్వుతున్నారు.

15 వేల ఎకరాలకు సమస్య

తొండంగి, తుని మండలాలతో పాటు అన్నవరం ఆయకట్టులో సుమారు 15 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు 1970–71లో ఈ పంపా రిజర్వాయర్‌ నిర్మించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే వరద నీటిలోని బురదతో దీని గర్భం పూడుకుపోయింది. పూడుకుపోయిన ఆ మట్టిని తీసే ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలుగుదేశం పార్టీ నేతలు గ్రావెల్‌, మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ఈ మట్టిని తవ్వేందుకు అన్నవరానికి చెందిన కూటమి నేతలు బినామీ రైతుల పేరుతో క్యూబిక్‌ మీటర్‌కు రూపాయి వంతున 10 వేల క్యూబిక్‌ మీటర్ల వ్యవసాయ భూమి సారవంతం చేసుకునేందుకు వీలుగా మట్టి తవ్వుకునేందుకు జలవనరుల శాఖ నుంచి మార్చి 24న అనుమతులు తీసుకున్నారు. తుని పెద్దన్నకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక నాయకుడుకి ఈ అక్రమ తవ్వకాల బాధ్యతలు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజులుగా ఈ దోపిడీ సాగుతూనే ఉంది. నిజానికి ఈ మట్టిని పంపా ఆయకట్టులో వ్యవసాయ భూములు సారవంతం చేసుకునేందుకు, అది కూడా రైతుల అవసరాల కోసమే వినియోగించాలి. రైతులు సొంత ఖర్చులతో మట్టిని తవ్వుకుని తరలించుకునేలా నిబంధనలు ఉన్నాయి. రిజర్వాయర్‌ వాస్తవ గర్భానికి మించి ఈ తవ్వకాలు చేయకూడదు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ తవ్వకాల సాగాలనేది నిబంధన. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా భారీ యంత్రాలతో రోజుకు వంద నుంచి 120 టిప్పర్లు వరకు గ్రావెల్‌, మట్టిని పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, తుని రూరల్‌ సహా కాకినాడ వరకు కూడా అక్రమంగా తరలిస్తున్నారు.

సింహభాగం పెద్దన్నకే..

గ్రావెల్‌తో పాటు మట్టిని లే–అవుట్లకు తరలించేస్తున్నారు. ఇక్కడి నుంచి తరలించిన గ్రావెల్‌ను లే అవుట్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. టిప్పర్‌ మట్టి రూ.5 వేలకు, టిప్పర్‌ గ్రావెల్‌ ఏడు, ఎనిమిది వేలకు తక్కువ కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పైగా తెల్లవారు జామున మొదలుపెడుతున్న తవ్వకాలు అర్థరాత్రి దాటే వరకు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ వాటాల్లో సింహభాగం అంటే 70 శాతం ఒక్క పెద్దన్నకు ముడుపు కట్టి వారం వారం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపేస్తున్నారు. మిగిలిన 30 శాతంలోనే రవాణా ఖర్చులు, మధ్యలో ఉన్న ఇద్దరు దళారులు పంచుకుంటున్నారు. ఇలా మట్టి అక్రమ రవాణాతో రూ.6 లక్షలు, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలతో రూ.10 లక్షలు కలిపితే నిత్యం తెలుగు తమ్ముళ్ల అక్రమాల రాబడి ఖరీదు రూ.16 లక్షలుగా లెక్కలు కడుతున్నారు. గడచిన నెల రోజులుగా లెక్క వేస్తే తమ్ముళ్ల అక్రమ దందా రూ.4 కోట్ల పైమాటగానే కనిపిస్తోంది. ఇందులో రెండున్నర కోట్లు తునికి చెందిన పెద్దాయన, అతని అనుచరుల జేబుల్లోకి వెళ్లిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం తక్కువలో తక్కువ రూ.16 లక్షల దందా ఈ రిజర్వాయర్‌ పూడిక తీతతోనే సాగుతోంది. తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లలో దోపిడీకి పాల్పడుతూ ఆయకట్టు రైతుల నోట మట్టికొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులలో చలనం రావడం లేదు.

రైతులకు తీరని అన్యాయం

పంపా రిజర్వాయర్‌లో సారవంతమైన మట్టిని ఆయకట్టులో సాగు చేస్తున్న రైతులు వినియోగించుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వంలో నాయకుల అండతో పంపాలో మట్టిని కమర్షియల్‌ అవసరాలకు వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

పెండ్యాల బాబీ, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి, సీతారాంపురం,

తొండంగి మండలం

దోపిడీ పాలనగా సాగుతోంది

నాకు, నా కుటుంబ సభ్యులకు పంపా ఆయకట్టులో 8 ఎకరాల భూమి ఉంది. వరదల వల్ల భూ ములు చౌడు బారాయి. ఇలానే ఆయకట్టు భూముల పరిస్థితి ఉంది. మట్టి తవ్వకాల ద్వారా కూటమి నాయకులు దోపిడీ చేస్తూ ఆయకట్టు రైతుల నోట మట్టి కొడుతున్నారు.

బెక్కం చంద్రగిరి రైతు ఏ కొత్తపల్లి గ్రామం

తొండంగి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement