నోరు విప్పకుండా ఉండలేం.. | - | Sakshi
Sakshi News home page

నోరు విప్పకుండా ఉండలేం..

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

విప్ప పూలలో ఎన్నో పోషకాలు

వివిధ రకాల తిను బండారాల తయారీ

రోగనివారిణి

సేకరణతో గిరిజనులకు రాబడి

అడవి తల్లి తన బిడ్డల్లాంటి గిరిజనులకు ప్రసాదించిన తియ్యని కానుకల్లో విప్ప పూలు ప్రధానమైనవి. వేసవిలో వేకువజామునే ఈ చెట్ల వైపు వెళ్లేవారికి సువాసన వెదజల్లుతోంది. ఈ పూలు గిరిజనులకు ఆదాయ వనరుగా మారింది. గిరిజన సంస్కృతిలో భాగంగా సారా తయారీకి, ఆలయాల్లో ప్రసాదంగా, తినుబండారాల తయారీకి కూడా వినియోగిస్తున్నారు. ఇక కాయల విషయానికొస్తే విప్పబద్దను నూనెగా చేసి ఇంటి వంటకాలు, దీపారాధనలు, నొప్పులు తగ్గేందుకు మసాజ్‌గా వాడుతుంటారు. ఏటా ముందుగా విప్ప చెట్టుకు పూజలు చేసిన అనంతరం విప్ప పూల సేకరణను గిరిజనులు ప్రారంభిస్తారు.

చింతూరు: లాటిన్‌ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ప్రధానంగా ఈ చెట్లు పోలవరం ముంపు మండలాలైన చింతూరు, వీఆర్‌ పురం, ఎటపాక ప్రాంతాల్లో ఉంటాయి. ఇళ్ల వద్ద, అడవిలో ఉండే ఈ చెట్ల నుంచి ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో పూలు రాలుతుంటాయి. ఈ చెట్లున్న ఇంటి వద్ద గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ మంచి సువాసనతో కూడిన విప్పపూలు రాలడం ప్రారంభమవుతుంది. అనంతరం ఇంటిల్లపాదీ కలసి బుట్టలు, చేటల్లో వాటిని సేకరిస్తారు. అలా సేకరించిన పూలను నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన విప్ప పూలను గిరిజనులు సంతల్లో వ్యాపారులకు విక్రయించడంతో పాటు తమ ఇళ్లలో సారా తయారీకి వాడతారు. కొన్ని దేవస్థానాలు విప్ప పూలను ప్యాకింగ్‌ చేసి ప్రసాదాలుగా విక్రయిస్తుంటాయి.

తియ్యని కానుకలా..

విప్ప పూలను ఇప్పటి వరకూ సారా తయారీ లేదా ప్రసాదాల కోసమే ఉపయోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు. విప్ప పూలతో లడ్డూ, హల్వా, జామ్‌, కేక్‌ వంటి వాటిని చేయడం విశేషం. వీటికి మంచి డిమాండ్‌ ఉండడంతో ఈ పూలకు డిమాండ్‌ పెరుగుతోంది.

పోషక గుణాలెన్నో..

విప్ప పూలలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఎన్నో రోగాలను హరించే గుణాలు విప్ప పూలలో ఉన్నాయని వైద్యులు చెబుతుంటారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయం చేసే గుణం విప్పపూలలో ఉంది. విప్పకాయలతో చేసిన నూనె వినియోగించి మసాజ్‌ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయి. ఈ పూలలో ప్రొటీన్లు, కార్బో హైడ్రేడ్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్‌, విటమిన్‌–సి వంటి పోషక విలువలు ఉంటాయి.

ఇతర అవ‘సారాలకు’..

ఆదివాసీలు తమ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా పండగలు, శుభకార్యాల్లో విప్పసారాను వినియోగిస్తారు. ఎటువంటి రసాయనాలు ఇతర పదార్థాలు వినియోగించకుండా బెల్లం ఊటతో కలిపి విప్పసారాను తయారు చేస్తారు. శుభకార్యాల సమయంలో తమ ఇళ్లకు వచ్చే బంధువులకు విప్పసారాను పోస్తారు. శుభకార్యాలు, దినకార్యాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమవెంట వారు తీసుకువెళ్లడం ఆనవాయితీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement