పుట్టినరోజునాడే విషాదం : అమెరికాలో ఏపీ టెకీ దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ నిపుణుడి అకాలమరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికాలో స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో అతని కుటుంబంలోతీవ్ర విషాదం నెలకొంది. అతని స్వగ్రామం విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పిరిడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏపికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరి కృష్ణ, మిస్సోరీలోని Sullivan సమీపంలో ఉన్న Meramec State Park వద్ద తన స్నేహితులతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి ఒక రిసార్ట్‌లో బస చేశారు. ఆ తర్వాత హరి కృష్ణ ఈత కొట్టేందుకు Meramec నదిలోకి దిగాడు. అయితే నీటి అడుగున కలుపు మొక్కల్లో చిక్కుకున్న అతను పైకి రాలేక మృత్యవాతపడ్డాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం నీటి అడుగున ఉన్న కలుపు మొక్కల్లో చిక్కుకుపోవడంతో అవి అతన్ని నీటిలోకి లాగేశాయని అధికారులు తెలిపారు. అతను బయటపడేందుకు తీవ్రంగా పోరాడినా ఫలితం లేకపోయింది. అనంతరం Sullivan అగ్నిమాపక శాఖ సిబ్బంది అతని మృతదేహాన్ని వెలికితీశారని Missouri రాష్ట్ర రహదారి గస్తీ దళం (State Highway Patrol) తెలిపింది.
విజయనగరంలోని ఒక ప్రైవేట్ కళాశాల నుండి BTech పూర్తి చేసిన తర్వాత, హరి కృష్ణ 2023లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి కొన్ని నెలల క్రితమే, St Louis నగరంలోని 'Elessent Clean Technologies' సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ముగ్గురు తోబుట్టువులలో అందరికంటే చిన్నవాడైన హరి కృష్ణకు, తల్లిదండ్రులు , వివాహమైన ఇద్దరు అక్కలు ఉన్నారు. తండ్రి శ్రీనివాసరావు ఆటో-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి రమాదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడు అర్థాంతరంగా కన్నమూయడంతో అతని తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. అతని మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.


