వేసారే వేసవిలో వీవన వీచికను మించిన సాంత్వన లేదు. కాలం మారింది. మధ్య తరగతి ఇళ్లలో సైతం ఏసీలు వచ్చి వేసవి తాపాన్ని తీరుస్తున్నాయి. ఎంత ఆధునిక సౌకర్యాలు వచ్చినా విద్యుత్ కోతల వేళ అందరికీ దిక్కయ్యేది కచ్చితంగా విసనకర్రే అనడం అతిశయోక్తి కాదు. ఏ చెట్టు కిందో.. ఏ బాల్కనీలోనో కూర్చుని ఉస్సురుస్సురుమంటూనే విసనకర్రతో విసురుకుంటూ ఉపశమనం పొందాల్సిందే. కాలాన్ననుసరించి అవసరమైన ఉత్పత్తులు తయారు చేస్తూ కొందరు ఉపాధి పొందుతుంటారు. కోరుకొండ మండలం గాడాల గ్రామంనకు చెందిన పి.సత్తిబాబు విసినకర్రలు తయారు చేసుకుని, వాటిని రాజమహేంద్రవరం, పరిసర గ్రామాలలో విక్రయిస్తున్నాడు. ఒకొక్కటి రూ.20కి విక్రయిస్తున్నానని, రోజుకు 25 వరకు తయారు చేసి వంద పూర్తయ్యాక ఇలా ఊరూరూ తిరిగి విక్రయిస్తుంటానని ‘సాక్షి’కి తెలిపాడు. శనివారం రాత్రి బొమ్మూరు బాలాజీపేట సెంటర్‌లో విసనకర్రలు విక్రయిస్తున్నాడు.
– రాజమహేంద్రవరం రూరల్


