● సత్యదేవుని చెంత సమస్యల చింత
● భక్తులలో అసంతృప్తి వెల్లువ
● నేడు దేవదాయ శాఖ మంత్రి ‘ఆనం’ రాక
● సీతారామ సత్రం శంకుస్థాపన,
మెట్ల దారి ప్రారంభం
అన్నవరం: రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేస్తాం.. సూపర్ సిక్స్ హామీలు, లక్షలాది ఉద్యోగాల కల్పన, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి.. గత ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి నేతలు ఇచ్చిన బూటకపు హామీలివి. అధికారం అందగానే అవన్నీ బుట్టదాఖలైన రెండేళ్లయినా ఒక్కటీ అమలు చేయకుండానే అన్నీ చేసేశాం అని ఆ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు.
సనాతన ధర్మానికి సారథులం అని గొప్పలు చెప్పుకొంటున్న కూటమి పెద్దలు ఆచరణలో మాత్రం దేవాలయాలకు, దైవ దర్శనాలకు వచ్చే భక్తులకు వసతులు, సౌకర్యాల కల్పనలో మొండి చేయి చూపుతున్నారు.
రత్నగిరిపై రూ.11.4 కోట్లతో నిర్మించిన సీతారామ సత్రానికి శంకుస్థాపన, మెట్ల దారిని ఆదివారం దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు నిర్మాణాలు గత వైఎస్సార్ సీపీ హయాంలోనే మొదలై నేడు ప్రారంభం కానుండడం గమనార్హం. కాగా ఆలయంలో పలు సమస్యలు, వసతుల లేమితో భక్తులు అవస్థ పడుతున్నారు. వాటి పరిష్కారానికి ఆయన సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పారిశుధ్యం అధ్వానం
అన్నవరంలో పారిశుధ్య బాధ్యతలు చూస్తున్న పద్మావతి సంస్థకు నెలకు రూ.80 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. అయినా ఎక్కడా సంతృప్తి వ్యక్తం కావడం లేదు.
మూలన పడిన వాషింగ్ మెషీన్లు
దేవస్థానంలో సత్రాలలో వస్త్రాలను మెషీన్ల ద్వారా ఉతికిస్తామని చెప్పిన ఆ సంస్థ దోబీలతో ఉతికించింది. వీటికే సుమారు రూ.ఐదు లక్షల బిల్లు దేవస్థానం నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సిఫార్సులతో ఉద్యోగ నియామకాలు
దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం 220 మంది మాత్రమే ఉండగా, వారిలో 16 మంది ఈ ఏడాది, మరో పది మంది వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. వీరి నియామకాలు ఏపీపీ ఎస్సీ ద్వారా కాకుండా ప్రజా ప్రతినిధుల సిఫార్సులతోనే పూర్తి చేస్తున్నారు. రెగ్యులర్ సిబ్బంది తక్కువగా ఉండడంతో కీలక పోస్టుల్లో వీరే ఉన్నారు.
అర్చకుల కొరత
దేవస్థానంలో 40 ఏళ్ల క్రితం 24 మంది అర్చకులు ఉంటే ఇప్పుడు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. సేవలు మాత్రం గతం కంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఉన్న వారిలో ఇద్దరు పదవీ విరమణ చేయనున్నారు. కనీసం మరో 15 మంది అర్చకులు అవసరమని ఆ వర్గం కోరుతోంది.
వనదుర్గ గుడి రహదారి పూర్తి చేయండి
మొదటి ఘాట్‌రోడ్‌లోని మూడో మలుపు నుంచి వనదుర్గ ఆలయానికి వెళ్లేందుకు రహదారి నిర్మాణం ఎంతో అవసరం. ఇది జరిగితే ట్రాఫిక్ అంతరాయాలు నివారించవచ్చు.
అన్నదానంలోనూ సత్యదేవుని ప్రసాదం పెట్టాలి
తిరుమలలోని అన్నదానంలో చిన్న లడ్డూ వడ్డిస్తారు. అలాగే సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలోనూ సత్యదేవుని ప్రసాదాన్ని పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వినియోగంలో ఉన్న విధానాన్నే ఇటీవల నిలిపివేయడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


