బతుకు నావకు లంగరు! | - | Sakshi
Sakshi News home page

బతుకు నావకు లంగరు!

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

17న బోట్ల గుర్తింపు

చేపల వేటకు విరామం అమలులోకి వచ్చాక 17వ తేదీ నుంచి వేట నిషేధ భృతి కోసం మత్స్యకార లబ్ధిదారుల గుర్తింపు చేపడతాం. ఆ సమయంలో బోట్‌తో పాటు మత్స్యకారులు (క్రూ) ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ బుక్‌ తీసుకురావల్సి ఉంటుంది. వేట నిషేధ కాలంలో చేప గుడ్లు పెట్డడం ద్వారా పునరుత్పత్తి జరుగుతుందని మత్స్యకారులు సహకరించాలన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టి చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. చేపల అమ్మడం గాని, ప్యాకింగ్‌ గాని చేయరాదు. ఐస్‌ విక్రయించకూడదు.

– కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, కాకినాడ

రేపు అర్ధరాత్రి నుంచి సముద్రంలో

చేపల వేట నిషేధం

జూన్‌ 14 వరకు అమలు

విరామ సమయంలో వేట నిషేధ భృతి

పగ్గాలు చేపట్టిన ఏడాదే

ఎగవేసిన కూటమి ప్రభుత్వం

తరువాతి సంవత్సరంలో

990 మందికి కోత

కాకినాడ రూరల్‌: సముద్ర జలాల్లో చేపల వేటకు రెండు నెలల పాటు విరామం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు, రొయ్యల పునరుత్పత్తి సజావుగా సాగడానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏటా బంగాళాఖాతంలో ఏప్రిల్‌ 15 నుంచి చేపల వేట నిషేధం అమలు చేస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాదీ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్యశాఖకు జీవో 88 ద్వారా వెల్లడించారు. మత్స్యశాఖ అధికారుల సహకారంతో బుధవారం నుంచి జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకు దాదాపు 61 రోజుల పాటు వేట నిషేధం అమలుకానుంది. జిల్లాలోని తొండంగి మండలం నుంచి తాళ్లరేవు వరకు సుమారు 94 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉండడంతో ఆరు తీర ప్రాంత మండలాలలో 58 మత్స్యకార హేబిటేషన్లు ఉండగా సుమారు 1,95,184 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో చేపల వేట ద్వారా సుమారు 29 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. చేపల వేటకు 392 మెకనైజ్డ్‌, 3993 మోటరైజ్డ్‌, 238 సంప్రదాయ బోట్లు కలిపి సుమారుగా 4623 బోట్లు వినియోగిస్తున్నారు.

ఒడిశా నుంచి కన్యాకుమారి వరకు..

బంగాళాఖాతంలో ఒడిశా నుంచి కన్యాకుమారి వరకు వేట నిషేధం అమలులో ఉంటుంది. జిల్లాలో తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్‌, కాకినాడ అర్బన్‌, కరప, తాళ్లరేవు మండలాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి. తాజా ఉత్తర్వులతో మత్స్యకారులు వేట ముగించుకుని ఒడ్డుకు చేరున్నారు. ఇప్పటికే అధికారులు వేట నిషేధం అమలుపై సంబంధిత ప్రాంతాల్లో ప్రకటనలు చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో రూ.10వేల ‘భరోసా’

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి వేట విరామ భృతిగా రూ.10 వేలు చొప్పున అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో వేట నిషేధ భృతి రూ.4 వేలు మాత్రమే ఉండేది.

లబ్ధిదారులు గుర్తింపు ఇలా

మత్స్యకారులు వేట విరామ భృతి పొందేందుకు మెకనైజ్డ్‌ బోట్‌కు (18 మీటర్ల పొడవు ఉండాలి) యజమానిని మినహాయించి 8 మంది అర్హులు. అలాగే 18 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న మెకనైజ్డ్‌ బోట్‌కు యజమానిని మినహాయించి పది మందికి, మోటరైజ్డ్‌ బోట్లుకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులు అర్హులు. బోట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, షిప్పింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు, రైస్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ను గుర్తింపు సమయంలో అందజేయాల్సి ఉంది.

2024లో భృతి ఎగవేత

2025లో 990 మందికి మొండిచేయి

మత్స్యకార మిత్రగా గొప్పగా చెప్పుకొనే కూడమి నేతలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదే మత్స్యకారులకు వేట నిషేధ భృతిని ఎగ్గొట్టారు. ఎన్నికలకు ముందు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తొలి ఏడాది ఇవ్వకుండా ముఖం చాటేశారు. 2025లో మాత్రం మొత్తం లబ్ధిదారులు 25,752 మంది కాగా బాంకు ఖాతాలు ఆధార్‌కు లింక్‌ అవ్వలేదన్న సాకుతో సుమారు 24,762 మందికి మాత్రమే సుమారు రూ.49.53 కోట్ల వరకు అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement