గద్వాల: ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌గా పి.కృష్ణగా శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న నర్సింగ్‌రావు బదిలీపై వెళ్లిన సంగతి విధితమే. ఈ క్రమంలో శనివారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.కృష్ణకు అదనపు కలెక్టర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇచ్చిన బాధ్యతలు చిత్తశుద్ధితో చేపడుతానని వెల్లడించారు.
25న జిల్లాస్థాయి
యువజనోత్సవ ఎంపికలు
గద్వాల: జాతీయ యువనోత్సవం–2027లో భాగంగా బుధవారం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ రామలింగేశ్వరగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని నదీఅగ్రహారం పీజీ సెంటర్‌లో నిర్వహించే పోటీల్లో యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో జానపద నృత్యం, జానపద గానం, చిత్రలేఖనం, వీధినాటకం, కవితారచన తదితర విభాగాల్లో పోటీలు నిర్వ హించనున్నట్లు వెల్లడించారు. 15– 29 ఏళ్లలోపు యువత పోటీల్లో పాల్గొనాలని చెప్పారు. మై భారత్ పోర్టల్‌లో ఇప్పటికే నమోదు చేసుకున్న వారితోపాటు ఇంకా నమోదు చేసుకోని వారు కూడా నేరుగా పోటీలు జరిగే ప్రదేశానికి హాజరై పాల్గొనవచ్చన్నారు.
దివ్యాంగులకు క్రీడా శిక్షణ
గద్వాల: దివ్యాంగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించే అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్), ఆదిత్య మెహతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన ఆసక్తి గల దివ్యాంగులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం http.docr.goof e.com.gormrలో ఈ నెల 28 సాయంత్రం 5గంటలలోగా దరఖాస్తు చేసుకుని సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.89195 42236ను సంప్రదించాలని కోరారు.
కురుమూర్తిస్వామి సన్నిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శనివారం కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పూలమాల, కొబ్బరికాయ సమర్పించి మెట్టుగుట్టపై ఉన్న ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సత్కరించారు.తదుపరి గుట్టపై ఉన్న అలివేలు మంగమ్మ అమ్మవారిని, స్వామివారి పాదాలను, పాదుకలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, తహసీల్దార్ ఎల్లయ్య, ఎస్‌ఐ గోకరి తదితరులు ఉన్నారు.
పల్లీ @ రూ.9,900
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 465 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.9,800, కనిష్టంగా రూ.5,176, సరాసరిగా రూ.7,016 ధరలు లభించాయి. అలాగే 2,274 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.3,636, కనిష్టంగా రూ.2,289, సరాసరిగా రూ.3,451 చొప్పున పలికాయి.


