వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

● రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతమ్‌

గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతమ్‌ అన్నారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన అనంతరం కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసిందన్నారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారణ జరిపి గ్రామ కమిటీ ద్వారా అర్హులైన వారికి మంజూరు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రెండో విడతలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున నిర్మించుకునేందుకు అవకాశం కల్పించామని, ఇందులో రూఫ్‌ రీప్లేస్మెంట్‌ స్కీంలో భాగంగా ఇప్పటికే రేకుల షెడ్లు, పెంకులు తదితర ఉన్న ఇళ్ల యజమానులు ఆర్‌సీసీ వేసుకునేందుకు ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున సహకారం అందిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో వీటిని 500, గుడిసెల్లో ఉంటున్న వారికి 500 ఇళ్లను కేటాయిస్తామన్నారు. గుడిసెలు తొలగించుకుని పక్కా గృహాన్ని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. పీఎం ఆవాస్‌ పోర్టల్‌లో నమోదు ద్వారా నిరుపేదలకు పక్కా గృహాల నిర్మాణానికి సహకారం అందిస్తున్నందున లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఇందుకుగాను పోర్టల్‌లో ఎఫ్‌టీఓ జనరేట్‌ చేయాలన్నారు. ఐహెచ్‌హెచ్‌ఎల్‌ నిర్మాణానికి కూడా వీబీజీ రాంజీ పథకంలో రూ.12 వేల చొప్పున సహకారం అందుతుందన్నారు. మొదటి విడతలో కప్పు స్థాయిలో ఇళ్లు నిర్మించుకుని పూర్తి చేసుకోలేకపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించడం ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించవచ్చన్నారు. అంతకు ముందు ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్‌, యాక్తపూర్‌ గ్రామాల్లో ఇందరమ్మ ఇళ్ల పురోగతిపై ఎండీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. జిల్లాలో మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు చాలామంది ఇప్పటికే గృహప్రవేశాలు చేసుకోవడం జరిగిందన్నారు. రెండో విడతలో నిర్మించుకునే అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామస్థాయిలో పరిశీలన అనంతరం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో తరచూ హౌసింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ కమిషనర్లు వార్డు అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆ తర్వాత ఎండీ గౌతమ్‌ జిల్లాకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశమై ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, డీఆర్‌డీఓ ముషాయిదాబేగం, జెడ్పీసీఈఓ నాగేంద్రం, డీపీఓ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement