అలంపూర్: ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ పపెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ నియోజకవర్గ చైర్మన్ రామ్మోహన్ డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో బుధవారం ఎల్‌నినో, కరువు సాయం, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చావేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్డీఎస్‌ను ఆధునికీకరించి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కాల్వలను విస్తరించి, అలంపూర్ వరకు సాగునీరు పారించడంతో పాటు మారమునగాల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి.. అలంపూర్, ఉండవెల్లి మండలాల్లోని 27వేల ఎకరాలకు సాగునీరు అందించాలని కోరారు. ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటరీల వారీగా కమిటీలను ఏర్పాటుచేసి, ఈ నెల 25వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 50వేలు, కౌలు రైతులకు రూ. 70వేలు అందించాలని డిమాండ్ చేశారు. పంట సాగుకు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్నారు. కాగా, ఉండవెల్లి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు, సాధన సమితి జేఏసీ నాయకుడు సురవరం లోకేశ్వర్‌రెడ్డి మృతిపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో జేఏసీ నాయకులు గోపాల్‌రెడ్డి, నగేశ్ ఆచారి, శేషన్ గౌడ్, ఈశ్వర్, సుంకన్న, రాఘవేంద్ర, సురేశ్ యాదవ్, రఘు, గొంగళ్ల ఈశ్వర్, బోస్ ఉన్నారు.


