ఎర్రవల్లి: ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టిసారించాలని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అర్చన అన్నారు. గురువారం మండలంలోని యాక్తాపురం, బీచుపల్లి, ఎర్రవల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి సురేష్గౌడ్తో కలిసి ఆమె క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులు, పంటల కీలక దశల్లో నేలలో తేమ అందుబాటులో లేకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం, రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాల గురించి చర్చించారు. రైతుల నుంచి ప్రస్తుత సాగు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎఫ్పీఓ రైతులు, మహిళా రైతులతో సమావేశమై ఎఫ్పీఓలో సభ్యత్వం పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు, సామూహిక మార్కెటింగ్, నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాల లభ్యత, సాంకేతిక సలహాలు, మెరుగైన మార్కెట్ అవకాశాల గురించి చెప్పారు. అలాగే వేరుశనగ పొలాన్ని సందర్శించి పంట పూత దశలో ఉన్నందున ఎకరాకు 200 కిలోల జిప్సం, 10 కిలోల యూరియా వేయాలన్నారు. అలాగే వరి పొలాలను సందర్శించగా.. సుమారు 635 ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయినట్లు రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో వరికి బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే జొన్న, పెసర, అలసంద, ఇతర అనుకూల పంటలను సాగు చేయాలని సూచించారు.


