గద్వాల: ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం లెక్కలను తారుమారు చేసి అధికారులనే బెదిరించే ప్రయత్నం చేసిన ఫరీదా రైస్‌మిల్లర్‌పై కేసు నమోదైంది. శనివారం ‘ఫరీదా రైస్‌మిల్లు జాదుగిరి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా దీనిపై స్పందించిన కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సదరు రైస్‌మిల్లర్‌పై కేసు నమోదు చేయాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డీఎం విమల శనివారం గద్వాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఫరీదా రైస్‌మిల్లుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
సంక్షేమ బోర్డు
ఏర్పాటు చేయాలి
గద్వాల న్యూటౌన్: హమాలీ, అసంఘటిత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. శనివారం ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నల్లకుంట లారీ హమాలీ యూనియన్ అడ్డా వద్ద కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో చార్రితాత్మక పోరాటాలు, త్యాగాలు చేసిందన్నారు. కనీస వేతనాలు, పనిగంటల పరిమితి, సామాజిక భద్రత, వంటి హక్కులు కల్పించేందుకు అనేక కార్మిక చట్టాల రూపకల్పన కోసం నిరంతరం పోరాడిందని గుర్తు చేశారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి, సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రంగన్న, ఉపాధ్యక్షుడు నారాయణ, లారీ హమాలీ యూనియన్ నాయకులు రాజు, రవి, వెంకట్రాములు, శేఖర్, పాండు ధర్మన్న, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.
టీజీఓ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
గద్వాల న్యూటౌన్: జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ) నూతన కమిటీని ఏకగ్రీవంగా పునర్నిర్మించారు. శనివారం జిల్లా కమర్షిల్ ట్యాక్స్ కార్యాలయంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, నూతన బాధ్యతల కేటాయింపుపై పలు తీర్మానాలు ఆమోదించారు. నూతన కార్యవర్గంలో భాగంగా జిల్లా అధ్యక్షుడిగా శశిధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, ఉపాధ్యక్షులు (మహిళా విబాగం) భవాని, ఈసీ మెంబర్లుగా సురేష్, శ్రీకాంత్‌రెడ్డి, శంకర్‌నాయక్‌లను ఎన్నుకున్నారు. గతంలో ఉన్న ఇతర పదవులను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా గెజిటెడ్ ఆఫీసర్ల సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, నూతన సంవత్సరం 2027 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ, సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ కోసం పోరాడాలని తీర్మానించారు. కార్యక్రమంలో కోశాధికారి వెంకటరాజారెడ్డి, ఉపాధ్యక్షుడు భీమ్లా, సహ కార్యదర్శి రామాంజనేయులు, కార్య నిర్వాహక కార్యదర్శి కరుణాకర్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు బీచుపల్లిలో
సీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రంను పురస్కరించుకొని ఆదివారం సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించాలని ఆయన కోరారు.
పల్లీ @ రూ.8,470
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 298 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.8,470, కనిష్టంగా రూ.5,249, సరాసరిగా రూ.6,539 ధరలు లభించాయి. 29 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,959, కనిష్టంగా రూ.7,649, సరాసరిగా రూ.7,959 చొప్పున వచ్చాయి. అలాగే 16 క్వింటాళ్ల వరి (సోన) రాగా క్వింటాల్ గరిష్టంగా రూ.3,622, కనిష్టంగా రూ.3,308, సరాసరిగా రూ.3,622 ధరలు లభించాయి.


