గద్వాల క్రైం/ ఎర్రవల్లి: భారత తొలి ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని శనివారం ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ సంరక్షణ, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు మరువ లేనివన్నారు. వందలాది సంస్థలను ఒక్కటి చేసిన మహనీయుడుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. భారత యూనియన్‌లో కలవడానికి ఇష్టపడని హైదరాబాద్ ప్రాంతాన్ని సైనిక చర్య ద్వారా యూనియన్‌లో కలిపి ఇక్కడి ప్రజల మన్నలను పొందారని గుర్తుచేశారు. అనంతరం ప్రతి ఒక్కరిలో ఐక్యతాభావం పెంపొందించేలా సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, షార్ట్ ఫిలిం, ఫొటోగ్రఫీ, సైకిల్ ర్యాలీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను తదితరులు పాల్గొన్నారు. బీచుపల్లి పదవ పటాలంలోనూ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఆదినారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధిరెడ్డి, శ్రీను, ఆర్‌ఐలు శ్రీనివాస్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.


