రసాభాసగా మున్సిపల్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

రసాభాసగా మున్సిపల్‌ సమావేశం

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

గద్వాల: గద్వాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన సాధారణ సమావేశం పట్టణంలోని ప్రధాన సమస్యలపై చర్చ లేకుండా ముగించారు. ప్రధానంగా సమావేశం ఎజెండాలోని 4వ అంశమైన ఇండస్ట్రీయల్‌ జోన్‌ను నివాస జోన్‌గా మార్చాలని పెట్టడంపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణంలోని సర్వే నంబర్లు 861/1/2, 861/2/2, 861/1/1/1/2లలో సుమారు 4.29 ఎకరాల భూమి ఇండస్ట్రీయల్‌ జోన్‌ పరిధిలో ఉంది. అయితే ఇందులో ఇటీవల కొందరు వ్యక్తులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా లేఅవుట్‌ చేసి ప్లాట్లు చేశారు. ఇలా ప్లాట్లు చేసిన వాటిని నివాసయోగ్యంగా విక్రయించాలంటే ఇండస్ట్రీయల్‌ జోన్‌ నిబంధన అడ్డుగా మారడంతో నివాసయోగ్యంగా మార్చాలని మున్సిపాలిటీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని ఎజెండాలో పొందుపర్చడంపై అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులకే మేలుచేకూరేలా ఎలా తీర్మానం చేపడుతారని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. గద్వాల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంటే ఇంకా 100 ఎకరాల మేర రీక్రియేషన్‌, ఇండస్ట్రీయల్‌ జోన్ల కింద ఉన్నాయని వాటిని కూడా నివాసయోగ్య జోన్‌గా మార్చితే పట్టణ ప్రజలకు పెద్దఎత్తున మేలు చేకూరుతుందని వాదించారు. అదేవిధంగా బీజేపీ కౌన్సిలర్లు సైతం వ్యతిరేకత తెలిపారు. కానీ డిసెంట్‌ ఇవ్వలేదు. మొత్తానికి పట్టణంలో పేరుకుపోయిన ప్రజాసమస్యలను పక్కన పెట్టి కేవలం లాభాపేక్షంగా ఉండే అంశాలపై చర్చించి సమావేశాన్ని మమ అనిపించడంపై పట్టణ ప్రజలు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement