అలంపూర్: నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి పథకంతో అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, ఉండవెల్లి, రాజోళి మండలాలకు చెందిన 76మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


