గద్వాల: ఉమ్మడి గట్టు మండలం (గట్టు, కేటీదొడ్డి మండలాలు)లోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం, తర్వాత పనులు దక్కించుకున్న గుత్తేదారు సుమారు 30 శాతం మేర పూర్తిచేయడం చకచకా జరిగిపోయాయి. అయితే హఠాత్తుగా గట్టు ఎత్తిపోతల పథకం పనులకు బ్రేక్ పడింది. 2022లో 1.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.650 కోట్లతో మొదలుపెట్టిన పనులు మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని బీడు భూములకు సాగునీరు పారడమే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఈ క్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని బీడు భూముల స్థితిగతులు, సాగునీటి ఆవశ్యకతను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టు ఎత్తిపోతల పథకాన్ని 1.32 టీఎంసీల నుంచి 3 టీంఎసీల సామర్థ్యానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా జీఓను విడుదల చేసింది. దీంతో వలసలకు పేరుగాంచిన గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని 33 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందనుంది.
2018లో శంకుస్థాపన..
రూ.650 కోట్లతో 1.32 టీఎంసీల సామర్థ్యంతో 33 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2018లో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయగా 2022 వరకు 30 శాతం పనులు పూర్తయి మధ్యలోనే ఆగిపోయాయి. అయితే 1.32 టీఎంసీలతో 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం సాధ్యం కాదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సాగునీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. అసంపూర్తి నిర్మాణం వల్ల భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు. దీనిపై సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. 33 వేల ఎకరాలకు సాగునీటిని అందించే సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒక టీఎంసీ నీటితో 11 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని.. ఈ క్రమంలో 33 వేల ఎకరాలకు సాగునీరు అందించాలంటే 3 టీఎంసీల నీరు అవసరం అవుతుందని పేర్కొంటూ సాగునీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై సమీక్షించిన అనంతరం రాష్ట్ర క్యాబినేట్ గట్టు ఎత్తిపోతలను 1.32 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి అవసరమైన రూ.1,200.84 కోట్ల నిధులు విడుదల చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గట్టు ఎత్తిపోతల వ్యయం రూ.1,781.9 కోట్లకు పెరిగినట్లయింది. ఇందులో భూ సేకరణ, జరిగిన 30 శాతం పనులకు రూ.193.24 కోట్లు ఖర్చు చేశారు.
డిజైన్‌లో మరికొన్ని మార్పులు
1.32 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన గట్టు ఎత్తిపోతల నిర్మాణంలో పెరిగిన సామర్థ్యంతో అదనంగా డిజైన్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గట్టు ఎత్తిపోతల పథకానికి నీటిని ర్యాలంపాడు జలాశయం నుంచి తరలించేలా డిజైన్ చేయగా ఇందులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఆలూరు సమీపంలో పంపుహౌజ్, అక్కడి నుంచి 12 మెగావాట్ల సామర్థ్యం గల 2 మోటార్లు సాయంతో గ్రావిటీ కెనాల్ ద్వారా గట్టు ఎత్తిపోతల రిజర్వాయర్‌లోకి నీటిని తోడేలా డిజైన్ చేశారు. కృష్ణానదికి వరద వచ్చే సమయంలో రోజుకు 700– 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేయగా.. ఇందుిలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. ఈ మేరకు నూతన డీపీఆర్‌ను తయారు చేసి ఆమోదం కోసం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్‌కు పంపితే అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత పనులు చేపడుతారు.
గట్టు ఎత్తిపోతల అప్‌గ్రేడ్‌తో జలసిరులు
1.32 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంపు
ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
గట్టు, కేటీదొడ్డి పరిధిలో 33 వేల ఎకరాలకు సాగునీరు
అదనంగా రూ.1,200 కోట్లు మంజూరు


