● జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు
● ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే
● రోగులకు మందులు,
పౌష్టికాహారం పంపిణీ
గద్వాల క్రైం: కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 2027 నాటికి దేశంలో మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జిల్లాలోని కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు స్పర్శ పేరుతో ఇంటింటి సర్వే చేపడుతూ అవగాహన కల్పిస్తున్నారు. అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రతినెలా వ్యాధిగ్రస్తులకు మందులను అందజేస్తున్నారు. అలాగే జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు ఈ వ్యాధిపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు చేపడుతున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో వ్యాధి గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి మనోధైర్యం కల్పించి భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
కేసుల గుర్తింపు..
కుష్ఠువ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2027 నాటికి దేశంలో వ్యాధిగ్రస్తులు లేకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో ప్రస్తుతం 65 మంది కుష్టువ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. రెండు రకాలుగా ఉండగా.. పాసీ బాసిల్లరి, మల్టీ బాసిల్లరిగా గుర్తించారు. ఈ మేరకు జిల్లాలో సిబ్బంది అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధిబారిన పడిన వారికి మందులు, పౌష్టికాహారం, వంట సరుకులు దాతల సహకారంతో అందజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.
వ్యాధి లక్షణాలు ఇలా..
కుష్ఠువ్యాధి లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మం, చెవులు, వీపు, చాతిపై నొప్పిలేని బొడిపెలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడక పోవడం, ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, కాళ్లు, చేతులకు తిమ్మిర్లు రావడం, అరిచేతులు, అరికాళ్లలో బొబ్బలు రావడం, చేతివేళ్లు, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ఈ వ్యాధి నొప్పి లేనిది కావడంతో సమాజంలో దాగి ఉన్న కేసులను గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స అందించడం వల్ల అంగవైకల్యాన్ని అరికట్టవచ్చని పేర్కొన్నారు.


