నేల ఆరోగ్యాన్ని కాపాడితేనే పంటల దిగుబడి | - | Sakshi
Sakshi News home page

నేల ఆరోగ్యాన్ని కాపాడితేనే పంటల దిగుబడి

Oct 25 2026 12:41 AM | Updated on Oct 25 2026 12:41 AM

ఎర్రవల్లి: రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అలవర్చుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడితేనే పంటల దిగుబడి పెరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. శనివారం మండలంలోని పుటాన్‌దొడ్డి రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఖేతీ బచావో అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయం, నేల ఆరోగ్యం, పంటల దిగుబడి, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించడం, మిశ్రమ పంటల సాగు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా నేల సారవంతం పెరిగి పంటల దిగుబడి మెరుగుపడుతుందన్నారు. రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, మిశ్రమ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి పచ్చిరొట్టె ఎరువులను వినియోగించాలన్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా నేలలో సేంద్రియ కర్బనం పెరిగి నేల ఆరోగ్యంగా ఉంటుందన్నారు. నేల సారాన్ని కాపాడుతూ పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని చెప్పారు. ఏడీఏ శివనాగిరెడ్డి మాట్లాడుతూ నేలలు ఆరోగ్యంగా ఉంటేనే పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయని, తద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రతి రైతు నేల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్‌ తరాలకు సారవంతమైన భూమిని అందించేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వరి పంట వేయరాదని కోరారు. కార్యక్రమంలో ఏఓ సురేష్‌గౌడ్‌, ఎంపీడీఓ మహేష్‌, సర్పంచ్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement