గద్వాల క్రైం: లోక్ అదాలత్ విజయవంతం చేసేందుకు కృషిచేసిన సిబ్బందిని జిల్లా జడ్జి కల్యాణ్ చక్రవర్తి, ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా కోర్టు ఆవరణలో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కక్షిదారులకు కేసుల నుంచి విముక్తి కల్పించి వారిని రాజీ అయ్యేలా కృషి చేశారన్నారు. లక్ష్యలను సాధించేందుకు అంకితభావంతో పనిచేసి.. న్యాయ, పోలీసు శాఖలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చొరవ తీసుకోవడంలో సిబ్బంది ఎంతో శ్రమించారన్నారు. ఫలితంగా రాష్ట్రస్థాయిలో జోగుళాంబ గద్వాల జిల్లాకు నాలుగో స్థానం దక్కడం అభినందనీయమన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజలకు సత్వర న్యాయం అందించారన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మరిన్ని విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. అనంతరం కోర్టు విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, కృష్ణ, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.


