గద్వాలన్యూటౌన్: దేశంలో సంపద ను వికేంద్రీకరించి.. కుల, మత, సామాజిక, ఆర్థిక అసమానతల నిర్మూలన, రాజ్యాంగ పరిరక్షణ సీపీఎంతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర నేత ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక భీంనగర్‌లో నిర్వహించిన సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఉత్పత్తి సృషిస్తున్న వర్గాలకే ఆ ఉత్పత్తిపై పూర్తి అధికారం ఉండాలన్నారు. దేశ ఐక్యత, అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కుల సమస్యను గుర్తించి.. కుల నిర్మూలన పోరాటాలు నిర్వహించిన ఘనత సీపీఎంకు ఉందన్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో రాజీలేని సమరశీల పోరాటాలు చేసింది కమ్యూనిస్టులేనని అన్నారు. భూసంస్కరణల అమలు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు పాటుపడటంతో పాటు వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, ప్రతి పౌరుడికి భూమి, ఉండటానికి ఇల్లు రాజ్యాంగ హక్కుగా కల్పించాలని జరిపిన పోరాటంలో వేలాది మంది సీపీఎం కార్యకర్తలు అసువులు బాశారని తెలిపారు. సామ్యవాద సమాజ స్థాపనే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన సూచించారు. జిల్లా కమిటీ సభ్యులు పరంజ్యోతి, రాజు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, నర్సింహ, విజయ్‌కుమార్, తిమ్మప్ప, గోవిందు, మధు తదితరులు పాల్గొన్నారు.


