అభివృద్ధి చేయాలి..
గద్వాల కోట తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగిన చారిత్రక ప్రదేశం. గద్వాల కోటకు లోతైన ఘన చరిత్ర ఉంది. చరిత్రను భావితరాలు మరిచిపోకుండా ఉండేందుకు గద్వాల కోటను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.
– త్రివిక్రమరెడ్డి, సింధనూరు
కోటను పునరుద్ధరించాలి..
గద్వాల కోట శిథిలావస్థకు చేరుకుంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన కోటను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికే కోటలోని అనేక కట్టడాలు చెదిరిపోయాయి. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి గద్వాల కోటను పునరుద్ధరించాలి. – ఆంజనేయులు, అయిజ
నిధులు రాలేదు..
స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటక కేంద్రాలుగా అబివృద్ధి చేసేందుకు గద్వాల కోటతోపాటు జూరాల ప్రాజెక్ట్, బీచుపల్లి ఆలయం, తుంగభద్ర నదీ పర్యాటక కేంద్రాల జాబితాలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు పారంభిస్తాం.
– రామలింగేశ్వరగౌడ్,
పర్యాటక శాఖ జిల్లా అధికారి
అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణం నడిబొడ్డున ఉన్న గద్వాల కోట చరగని చరిత్ర లిఖిస్తోంది. 17వ శతాబ్దంలో నిర్మించబడిన చారిత్రక వారసత్వ సంపద అయిన ఈ కోట కేంద్ర పర్యాటక శాఖ ‘స్వదేశీ దర్శన్’ పథకం కింద అభివృద్ధి చేయడానికి అనుమతులు లభించాయి. గద్వాల కోటను రాజా పెద్ద సోమభూపాలుడు (నల్ల సోమనాద్రి) 1662లో నిర్మించారు. ఇతను పూడూరును రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోట మరమ్మతు సమయంలో గుప్తనిధి లభించడంతో శత్రుదుర్భేద్యంగా ఉండాలనే ఉద్దేశంతో గద్వాలలో మట్టికోట నిర్మించారు. కోటల నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని, చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించి తర్వాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చినట్లు చరిత్ర చెబుతోంది.
ప్రధాన ఆకర్షణలు
కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం గద్వాల సంస్థాన ప్రభువుల ఇలవేల్పు. 90 అడుగుల గాలి గోపురం, 3 కి.మీ., చుట్టు కొలత కలిగిన మట్టికోట గోడలు, బయట వైపు ఎత్తైన బురుజులు, రాజభవన శిథిలాలు, పాతరాజభవనాల శిథిలాలు, ఆర్కాకార ద్వారాలు, అలంకార నిచ్ఛీలు ఉన్నాయి. ఇదే కోటలో శివాలయం, ఎల్లమ్మ దేవాలయం సైతం ఉన్నాయి. కోట లోపల పురాతన బావి, ఆలయ గోడలపై అద్భుతమైన శిల్పకళ, దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి. గద్వాల కోట తెలంగాణ చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
ఏకీకృత పర్యాటక సర్క్యూట్..
కేంద్ర పర్యాటక శాఖ ‘స్వదేశీ దర్శన్’ ‘ప్రసాద్’ పథకాల కింద తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 31న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గద్వాలలో పర్యాటక ప్రాజ్టెలను ప్రకటిస్తూ.. తెలంగాణలోని 15 ప్రధాన పర్యాటక ప్రాజెక్టులకు రూ.614.32 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందులో గద్వాల కోట, అలంపూర్ జోగుళాంబ దేవాలయం, జూరాల ప్రాజెక్ట్, బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం, తుంగభద్ర నదీ తీరాన్ని అనుసంధానిస్తూ ఏకీకృత పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. అయితే అలంపూర్ జోగుళాంబ దేవాలయానికి మాత్రం నిధులు మంజూరు కావడంతో పనులు కూడా పూర్తిచేసి ప్రారంభించారు.
స్వదేశీ దర్శన్ పథకం 2.0కు గద్వాల కోట ఎంపిక
పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి అడుగులు
1662లో పెద్ద సోమభూపాలుడు హయాంలో నిర్మాణం
కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం
నిధుల మంజూరులో ఆలస్యంతో నిరాశ


