మల్దకల్‌లో ధర్నా చేస్తున్న రైతులు
మల్దకల్: వ్యవసాయానికి విద్యుత్ కోతలను నిరసి స్తూ రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం మల్దకల్ బస్టాండ్ చౌరస్తాలో అయిజ – గద్వాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో రో డ్డుపైకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా విద్యుత్ సమస్య తీవ్రంగా మారిందన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి కారణాలు లేకుండానే కోతలు విధిస్తున్నారన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించి.. పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు రైతులకు సంఘీభావం తెలిపారు. రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విద్యుత్ ఏఈ రాజేశ్ ధర్నా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు తిరుపతిరెడ్డి, వెంకటేశ్, నాగరాజు, కృష్ణారెడ్డి, తిమ్మన్న పాల్గొన్నారు.


