ధరూరు: ప్రభుత్వం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని జెన్‌కో ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం జూరాల హైడ్రో విద్యుత్ కేంద్రంలో జెన్‌కో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఆగస్టు 29న టీజీపీఈజేఏసీ ప్రతినిధులు, ట్రాన్స్‌కో, జెన్‌కో డిస్కంల ఎండీలతో నిర్వహించిన సంయుక్త సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చింనట్లు తెలిపారు. ఆయా సమస్యలపై రెండు వారాల్లో మరోసారి సమావేశం నిర్వహించి.. చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇచ్చిన హామీకి విరుద్ధంగా జెన్‌కో యాజమాన్యం యాదాద్రి థరమల్ విద్యుత్ కేంద్రంలో బూడిద నిర్వహణ విభాగం, బొగ్గు నిర్వహణ విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచేందుకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.


