ఆందోళనలో జూరాల ఆయకట్టు రైతులు
పూర్తిస్థాయిలో నీరివ్వాలి..
అధికారుల నిర్ణయం
సరికాదు..
ఉన్నతాధికారుల
ఆదేశాల మేరకు..
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఏర్పడినప్పటి నుంచి ఏటా వానాకాలంలో వరి సాగు కోసం పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేసే అధికారులు.. ఈ ఏడాది మాత్రం వారాబందీ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నా.. వానాకాలంలో వారాబందీ ఏమిటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవని కారణంగా ఈసారి ఆరుతడి పంటలకే సాగునీరు వదులుతామని అధికారులు ఐడీబీ సమావేశంలో నిర్ణయించారు. వరి నారుమడులు సిద్ధం చేసుకున్న అన్నదాతలు ఎలాగైనా తమ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు వదలాలని వేడుకుంటున్నారు. జలాశయాలు, ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని.. తక్కువ నీటిని వినియోగించాలంటూ గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాసంగి సీజన్‌లో వారాబందీ పద్ధతిన సాగునీటిని అందించిన అధికారులు.. వానాకాలం సీజన్‌లో కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిదిలో ఈసారి రబీ పంట సాగుకోసం ప్రాజెక్టు సమీపంలోని రామన్‌పాడ్ రిజర్వాయర్‌తో పాటు శంకర సముద్రం, గోపల్‌దిన్నె వరకు అమరచింత ఎత్తిపోతలు, కురుమూర్తి ఎత్తిపోతల ద్వారా వారంలో 4 రోజులు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లా పరిధిలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల వరకు ఉండగా ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
జూరాల ఎడమ కాల్వ కింద ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 85 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.629 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వీటిని వానాకాలం పంటల సాగుతో పాటు తాగునీటి అవసరాలకు వినియోగించనున్న నేపథ్యంలో ముందస్తుగా వారాబందీ అమలు చేశారు.
ఆరుతడి పంటలకే ప్రాధాన్యమంటున్న అధికారులు
వరి సాగుకే ఆసక్తి చూపుతున్న
అన్నదాతలు
ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు..
అమరచింత ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది వానాకాలంలో 4 ఎకరాలు వరి సాగుచేశాను. వారాబందీ విధానంలో నీరు వదిలితే పంటకు సరిపడా అందక ఆశించిన స్థాయిలో దిగుబడి రాదేయోనన్న భయం ఉంది. జూరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలి.
– మోహన్‌రెడ్డి, సింగంపేట
యాసంగి సీజన్‌లో కేవలం రామన్‌పాడు వరకే నీటిని అందించిన అధికారులు వానాకాలంలో కూడా వారాబందీ అమలు చేయాలని నిర్ణయించడం శోచనీయం. కేవలం ఆరుతడి పంటల సాగుకే నీరందిస్తామని చెప్పడం సరికాదు. మండలంలో జూరాల నీటిపై ఆధారపడి సుమారు 6 వేల ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించాలి. – ఎండీ నడిపి ఖాజా,
మామిడి రైతు, గోవర్ధనగిరి (వీపనగండ్ల)
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ఆయకట్టుకు వానాకాలం సీజన్‌లో వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నాం. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆరుతడి పంటలకుగాను వారంలో 4 రోజుల పాటు నీటిని అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా వేసవిలో కాల్వల్లో పూడికతీత చేపట్టాం. వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – షమీ ఉల్లా,
డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్


