మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని డీఐఈఓ హృదయరాజు సూచించారు. శనివారం మానవపాడు జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం, తరగతుల నిర్వహణ, బోధనా పద్ధతులు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన అధ్యాపకులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కళాశాల పరిసర గ్రామాల్లో ఇంకా ఇంటర్మీడియట్‌లో చేరని విద్యార్థుల వివరాలను సేకరించాలని సూచించారు. ఇంటర్ విద్య ప్రాధాన్యతను విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించి.. వారు కళాశాలలో చేరేలా ప్రోత్సహించాలని తెలిపారు.


