చెట్టు కోసం..
గ్రామానికి దిక్సూచిగా.. గ్రామంలో జరుగుతున్న శుభ, అశుభ్ర కార్యక్రమాలకు సాక్షీభూతంగా..
వేసవిలో బాటసారులకు సేదతీర్చే నీడగా.. సభలు, సమావేశాలకు వేదికగా.. ఎన్నో రకాల పక్షులకు గూడుగా.. నిలుస్తున్న తొమ్మిది దశాబ్దాల నాటి రావి చెట్టు.. కాలక్రమేణా కనుమరుగయ్యే రోజులు వచ్చాయి. ఎంతో మందికి నీడనిచ్చిన ఆ చెట్టును కొందరు కబ్జా చేసుకుని వ్యాపారాలు ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు పూర్తిగా ఆక్రమించుకునే
ప్రయత్నాలు చేస్తుండటంతో.. స్థానిక యువకులు చెట్టును కాపాడుకునేందుకు
ముందుకొచ్చారు. చేయిచేయి కలిపి గ్రామస్తులను చైతన్యం చేసి.. చెట్టు కోసం ఊరంతా ఏకం చేసి కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు ఉద్యమబాట పట్టారు. – రాజోళి
●
మా ఊరిలో జరిగే ప్రతి పెళ్లిలో ఈ చెట్టు పాత్ర ఉంటుంది. పందిరి వేసేందుకు ఆకులు మొదలుకొని ప్రత్యేక పూజలు చేసే వరకు ఈ చెట్టుపై ఆధారపడతాం. ఇది నా చిన్నతనం నుంచి మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి చెట్టు కింద మా జీవితమంతా గడిచింది. ఇంతటి ప్రాధాన్యత గల చెట్టును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే వినాశ కాలమే.
– కుర్వ చిన్న రాముడు, పెద్దతాండ్రపాడు
మా ఊరిలో ఉండే రావి చెట్టు అంటే చుట్టుపక్కల గ్రామాల వారికి ఎంతో ప్రేమ. అటు.. ఇటుగా వెళ్లేవారు సేద తీరడంతో పాటు, గతంలో ప్రజలకు ఇష్టమైన దుర్గమ్మ పాలను తీసుకెళ్లే వేదికగా నిలిచేది. మా ఇళ్లలో పెద్దలు పొలాలకు వెళ్తే.. పిల్లలమంతా ఈ చెట్టు కిందనే ఆడుకుంటూ నిద్రించేవాళ్లం. ఆ సందర్భంలో ఏనాడు చిన్న కీడు కూడా జరగలేదు.
– రంగన్న, పెద్దతాండ్రపాడు
చెట్టుకు సంబంధించి మా పెద్దలు ప్రస్తుతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి పత్రం రాసిచ్చారని చెబుతున్నారు. అలాంటిదేమి జరగలేదు. చెట్టు పరిసర ప్రాంతాల్లో మా పెద్దలు ఉండేవారు. ప్రస్తుతం ఉంటున్న వారు మా పెద్దలు రాసిచ్చారని చెబుతూ కొంత ఆక్రమించగా.. మరికొంత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం నేను గ్రామసభలో కూడా చెప్పాను.
– మీసాల లక్ష్మన్న, పెద్దతాండ్రపాడు
గ్రామంలో చెట్టును కాపాడేందుకు అందరం ఏకమయ్యాం. గ్రామసభ పెడితే కబ్జాకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులు మాత్రం రాలేదు. అదే రోజున చెట్టును కాపాడాలని, రచ్చ కట్టను కాపాడుకోవాలని తీర్మానించాం. అయినా కొందరు లోలోపల చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెట్టు కోసం ఎంతటి పోరాటం చేయడానికై నా సిద్ధంగా ఉన్నాం. – బడేసాబ్, పెద్దతాండ్రపాడు
రాజోళి మండలం పెద్దతాండ్రపాడులో 80 ఏళ్ల పైబడిన పురాతన రావి చెట్టు
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని పెద్దతాండ్రపాడు గ్రామానికి వెళ్లగానే గ్రామ నడిబొడ్డులో పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. కొత్తగా గ్రామానికి వచ్చేవారు చెట్టు కింద కూర్చున్న స్థానికులను అడిగి అడ్రస్ తెలుసుకుంటారు. దీంతోపాటు అటు తుమ్మిళ్ల.. ఇటు చింతల్ క్యాంపు, ముండ్లదిన్నె, కొంకల గ్రామాలకు వెళ్లేవారికి దిక్సూచిగా నిలుస్తుంది. దాదాపు 90 ఏళ్ల క్రితం నాటిన ఈ చెట్టు చుట్టూ 12 ఫీట్ల మేర విస్తరించింది. ఈ చెట్టు ఆవరణ ప్రస్తుతం తగ్గుతూ వచ్చింది. చెట్టు చుట్టూ ఉన్న రచ్చబండ లాంటి కట్ట చుట్టూ ప్రజలు రాకపోకలు సాగించేవారు. కానీ, కొందరు ఇల్లు, ప్రహరీ నిర్మించడం, మరోపక్క కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఉనికి కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది.
ప్రస్తుతం ఉన్న రిజిష్టర్లు, మినిట్స్ కాకుండా.. గతంలో గ్రామస్తుల తీర్మానాలు పెద్దల సమక్షంలో జరిగేవి. అందుకు ఈ చెట్టు కింద రచ్చ కట్టనే వేదికగా ఉండేది. గ్రామంలో పండుగలు, వేడుకలు ఎప్పుడు చేయాలి.. గ్రామంలో విపత్తులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ప్రస్తావించేందుకు.. చేపట్టాల్సిన కర్తవ్యాలను ఈ రావి చెట్టు సాక్షిగా నిర్ణయం తీసుకునేవారు. ప్రత్యేకించి వేలం పాటలు, కూరగాయల సంత, పశువుల అమ్మకాలు, ఆలయ నిర్వహణ, రైతు సంబరాలు, ఇతరత్రా వ్యవహారాలకు ఈ చెట్టు వేదికగా నిలిచేది. ఇలా ఏళ్ల తరబడి ఎన్నో కార్యక్రమాలు, చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచి.. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ.. ప్రకృతి పరిరక్షణలో ప్రధాన పాత్ర పోసిస్తున్న ఈ చెట్టును తొలగించేందుకు కొందరు స్వార్థపరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
పండుగల సమయంలో రావి చెట్టుకు పూజలు చేస్తున్న గ్రామస్తులు (ఫైల్)
ఎంతో చరిత్ర ఉన్న రావిచెట్టు గురించి మాకు గ్రామస్తుల వినతిపత్రాల ద్వారా తెలిసింది. దీని కోసం గ్రామంలో విచారణ చేపట్టాం. ప్రకృతిలో భాగమైన చెట్టును నాశనం చేస్తే సహించేది లేదు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించి చెట్టును నరికినా.. కబ్జా చేసేందుకు ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తాం.
– పర్వేజ్ అహ్మద్,
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జోగుళాంబ గద్వాల
పెద్దతాండ్రపాడులో
9 దశాబ్దాల నాటి
పురాతన రావి చెట్టు
తరతరాలుగా
దేవుళ్లతో సమానంగా
పూజిస్తున్న
గ్రామస్తులు
క్రమంగా
కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి
12 ఫీట్ల ఆవరణ
ఏకంగా ఇల్లు, ప్రహరీ నిర్మించి ఆక్రమణ
కాపాడుకునేందుకు ఏకమైన యువకులు, గ్రామస్తులు


