సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు

Aug 23 2026 1:40 AM | Updated on Aug 23 2026 1:40 AM

రాజోళి: పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ పి.అర్చన సూచించారు. శనివారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల బృందం శ్రీరామ్‌, మమతలతో కలిసి ఆమె రాజోళిలో పర్యటించి.. వరి, పత్తి, మిరప, కంది తదితర పంటలను పరిశీలించారు. వరి పొలంలో తగినంత నీటిని మాత్రమే నిల్వ ఉంచాలని, 15 నుంచి 20 రోజుల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. పత్తి పంటలో జాసిడ్స్‌, తామర పురుగులు, తెల్లదోమ, గులాబీ రంగు ఉధృతిని గమనించాలని.. ప్రధానంగా గులాబీ రంగు పురుగు నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని తెలిపారు. మిరప పంటలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండొద్దన్నారు. కంది పంటలో కలుపు లేకుండా ఉంచుకోవాలని, సమతుల్య ఎరువుల వినియోగం ఉండాలన్నారు. చెరుకు పంటలో తేమను కొనసాగిస్తూ, కాండం తొలుచు పురుగులు, ఎర్ర కుళ్లు సోకిన మొక్కలను తొలగించాలని తెలిపారు. వారి వెంట ఏఓ సురేఖ, బిందు ఉన్నారు.

నిబంధనలు

ఉల్లంఘిస్తే చర్యలు

మల్దకల్‌: ఫర్టిలైజర్‌ దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువుల విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. శనివారం మల్దకల్‌లోని పలు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎరువులను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. యాప్‌లో బుకింగ్‌ చేసిన తర్వాతే ఎరువులు అందించాలని డీలర్లకు సూచించారు. అలాగే ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని.. స్టాక్‌ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఓ రాజశేఖర్‌ ఉన్నారు.

క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా పరిశీలన

రాజోళి: క్షేత్రస్థాయిలో బీజేపీ బీఎల్‌ఏలు ఓటరు జాబితా పరిశీలన చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తపాలా రామాంజనేయులు అన్నారు. శనివారం వడ్డేపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన పార్టీ బీఎల్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్‌ ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితా అందుబాటులో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో అర్హుల పేర్లు జాబితాలో గల్లంతు కాకుండా చూడాలన్నారు. ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారని.. అలాంటి వారికి సహకారం అందించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేకే రెడ్డి, అశోక్‌, వెంకటేశ్వర్లు, నాగేశ్వర్‌రెడ్డి, నాగమల్లయ్య ఉన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

గద్వాలన్యూటౌన్‌: స్థానిక ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏఈడీపీ – బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సు బోధనకు సంబంధిత అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డా.మీనాక్షి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కామర్స్‌ విభాగంలో ఎంకాం పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంకాంతో పాటు ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, పీహెచ్‌డీ అర్హత కల్గిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన వివరాలతో ఈ నెల 24వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement