గద్వాల/ ధరూరు: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు మిగిలి ఉన్న షెడ్యూల్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండలాల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో గూగుల్ మీట్ నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో మ్యాపింగ్ జరగని ఓటర్లందరికీ నోటీసులు జారీచేసి నిర్దేశిత తేదీల్లో అవసరమైన డాక్యుమెంట్లతో హియరింగ్‌కు హాజరయ్యేలా చూడాలన్నారు. అనామలిస్ ఓటర్ల విషయంలోనూ ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి ముందుకెళ్లాలన్నారు. గ్రామ, వార్డు సభలను నిర్వహించి నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు దివానిర్దేశం చేయాలన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో అసలే తమ పేరులేని అర్హులైన ఓటర్లు తిరిగి ఫాం–6 ద్వారా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాలన్నారు. శనివారం బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి.. సర్ ప్రస్తుత ప్రక్రియపై అవగాహన కలిగించాలన్నారు. బేసిక్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటే అర్హులైన ఓటర్లందరికీ ఓటుహక్కు కల్పించడమే కాక తప్పులులేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేదుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
ధరూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి.. సర్ ప్రక్రియపై అధికారులకు సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన ధ్రువపత్రాలు స్వీకరించి రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ప్రక్రియలో ఎలాంటి లోపాలు, పొరపాట్లకు తావు లేకుండా సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నందిని, ఎంపీడీఓ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగవంతం చేయాలి
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని, ఆర్‌అండ్‌ఆర్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణ, పరిహారం, చెల్లింపులు, ఆర్‌అండ్‌ఆర్, అటవీ సమస్యలు, ఆర్థిక అనుమతులు, టోకెన్లు, ఇతర ఆర్థిక ప్రక్రియ పరమైన కారణాలతో సాగునీటి ప్రాజెక్టు ఆలస్యమవుతున్నా సంబంధిత వివరాలను నివేదికను పంపాలన్నారు. సమావేశంలో ఎస్‌డీసీ కృష్ణ, ఎస్‌ఈ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


