
యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
గద్వాల వ్యవసాయం: యూరియా కోసం రైతులు ప్రతి నిత్యం రాస్తారోకోలు, నిరసనలు చేపట్టాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొంది. వారం రోజల వ్యవధిలోనే గద్వాలలో రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. మంగళవారం ఉదయం 8 గంటల వరకే గద్వాల సింగిల్‌విండో కార్యాలయానికి దాదాపు 400 మంది రైతులు చేరుకున్నారు. యూరియా స్టాక్ లేదని, టోకెన్లు ఇప్పుడే ఇవ్వమని కార్యాలయ సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ఎదుట పాదరక్షలు వరుస క్రమంలో ఉంచి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమీపంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై రైతులు బైఠాయించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ మొగిలయ్య అక్కడికి చేరుకొని రైతులు, సింగిల్‌విండో కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. మంగళవారం రాత్రి వరకు స్టాక్ వస్తుందని సిబ్బంది డీఎస్పీకి చెప్పడంతో.. ఇప్పుడు టోకెన్లు తీసుకోవాలని, అందరికీ బుధవారం యూరియా ఇస్తారని శాతింపజేశారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. 550 మంది రైతులకు 1,200 బస్తాల యూరియా టోకెన్లను సింగిల్‌విండో కార్యాలయ సిబ్బంది పంపిణీ చేశారు.

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు