
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
గద్వాల: జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా చెప్పడానికి సిద్ధమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సవాల్‌కు ఆయన స్పందిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. మీరు ఏడేళ్ల పాలనలో గద్వాలకు తీసుకొచ్చిన నిధులు ఎంత వాటి వివరాలను అంకెలతో సహా ప్రజలకు వివరించాలన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ఎంతనిధులతో అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంతనో వివరించాలన్నారు. గోన్‌పాడు, పరమాల వద్ద కట్టిన డబుల్‌బెడ్రూం ఇళ్లు శిథిలావస్థకు చేరినప్పటికీ వాటిని నేటివరకు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లిగుంట్ల వద్ద పేదలకు ఇచ్చిన ప్లాట్లు లాక్కుని వారిని రోడ్డున పడేసిందెవరని, నియోజకవర్గంలో ఒక్కరోడ్డు అయినా వేయించారా, కనీసం దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులైన చేశారా అని ప్రశ్నించారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో 99, 100 ప్యాకేజీల పరిధిలో పనులు ఎందుకు పెండింగులో ఉన్నాయని, గుర్రంగడ్డ, గట్టు ఎత్తిపోతలు ఎక్కడ వేసిన పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. ఇసుక, మట్టి దందాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నది మీరు, మీ అనుచరులు కాదా అన్నారు. నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది డీకే అరుణ హయాంలోనే జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు మేము సిద్ధమని తేదీ, స్థలం మీరే నిర్ణయించండని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్, చిత్తారికిరణ్, శ్యామ్‌రావు, రజక జయశ్రీ, నర్సింహులు, దేవదాసు, అనిల్, మాలీం ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.