
కేసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు సరికాదు
గద్వాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ పేరుతో బీఆర్‌ఎస్ అధినాయకత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్‌ఎస్ నాయకుడు హనుమంతునాయుడు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ జోలికొస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిరసిస్తూ మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, కృష్ణవేణి చౌరస్తాలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. ఘోష్ కమిషన్ ట్రాష్ అని, అసెంబ్లీలో చర్చించకుండా సీబీఐకి అప్పజెప్పడంతోనే కాంగ్రెస్ పార్టీ అభాసుపాలు అయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి ఇవ్వడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్‌ఎస్‌లపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, చక్రధర్‌రావు, రాఘవేంద్రరెడ్డి, మోనేష్, బీచుపల్లి, రాజు, వెంకటేష్‌నాయుడు, రాము, శ్రీరాములు, చక్రధర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అతికూర్ రెహమాన్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.