
గజిబిజి తీగలు
● గాల్లో కలుస్తున్న ప్రాణాలు
● ఇష్టారాజ్యంగా టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు
● ప్రమాదాలు జరిగినప్పుడే అధికారుల హడావిడి
తొలగింపు చర్యలు
చేపడుతున్నాం
నిబంధనలకు విరుద్ధంగా కరెంటు స్తంభాలను ఉపయోగించి బిగించిన కేబుల్ తీగలను తొలగించే చర్యలు చేపట్టాం. జిల్లా కేంద్రంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సంస్థల నిర్వాహకులే స్వచ్ఛందంగా తీగలను నిబంధనల వేరకు అమర్చుకోవడానికి కొంత గడువు అడిగారు.
– రమేష్‌బాబు, ఏడీఈ, గద్వాల
గద్వాల టౌన్: జిల్లాలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలకు టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు ఇష్టానుసారంగా వేయడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనల ప్రకారం 18 అడుగుల ఎత్తుపై వీటిని లాగాలి. కానీ స్తంభాలకు ముడిపెట్టి తక్కువ ఎత్తులో లాగడంతో కిందకు వేలాడుతున్నాయి. ఇవి తెగి కరెంటు తీగలపై పడి ప్రమాదాలు జరిగే అవకాశమున్నా నిబంధనలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం గద్వాలలో భారీ వినాయకుల విగ్రహాల నిమజ్జనోత్సవ ఊరేగింపు ఉంది. తర్వాత దుర్గాదేవి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లా కేంద్రంతో పాటు అయిజ, శాంతినగర్ పట్టణాలు, మండల కేంద్రాల్లోని వీధుల్లో శోభాయాత్రలు చేపట్టడం పరిపాటే. అప్పుడు ఈ తీగలే ప్రమాదకరంగా మారి ప్రాణాలు బలి తీసుకునే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల కిందట హైదరాబాద్‌లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యుత్ శాఖ నివారణ చర్యలు చేపట్టింది. జిల్లాలో వీటి పరిస్థితిపై పరిశీలన కథనం...
పరిశీలనలో గుర్తించిన అంశాలు...
● ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని మున్సిపాలిటీ, పట్టణాల్లో ఇంటర్నెట్, టీవీ కేబుళ్లు తెగిపోయాయి. పాత వాటిని అలాగే ఉంచి కొత్త వాటిని వేయడంతో గజిబిజిగా మారుతున్నాయి.
● స్తంభాలకు కేబుల్, ఇంటర్నెట్ తీగల చుట్టలు వదిలేయడంతో విద్యుత్ సిబ్బంది స్తంభం ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు గాయాలపాలవుతున్నారు.
● స్తంభాల నుంచి ఇళ్లకు అమర్చిన తీగలపై కోతులు దూకినప్పుడు కిందకు వేలాడుతున్నాయి.
● విద్యుత్ స్తంభాలకు అనుమతులు లేకుండా కేబుల్ టీవీ, ఇంటర్నెట్ తీగలను ఇష్టారాజ్యంగా అమర్చడం వలన, విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
నిత్యం ఫిర్యాదులు
జనవాసాల మధ్య, ఇళ్లపై నుంచి వెళ్తున్న ప్రమాదకర విద్యుత్ తీగలను తొలగించాలని చాలాకాలంగా ప్రజలు అధికారులను కోరుతున్నారు. వీటిపై నిత్యం విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రమాదాలు జరిగి, వైర్లు తెగిపడిన సందర్భాల్లో మాత్రమే హడావుడి చేస్తున్న ట్రాన్స్‌కో అధికారులు తర్వాత దాని గురించి పట్టించుకోవడం లేదు. అయితే జనావాసాలకు దగ్గరగా ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు కొన్నింటిని ఇటీవల అధికారులు గుర్తించి సరిచేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న తీగలను సరిచేయాల్సి ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.