
వైఎస్సార్ సేవలు నేటికీ పదిలం
గద్వాలటౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, సేవలు నేటికీ పదిలంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు, వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ నాయకుడు శంకర్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం జీవిత బీమా, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, విద్యార్థుల కోసం ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందించి విద్యా ప్రదాతగా నిలిచారని కొనియాడారు. ఎంతోమంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారి ఇళ్లలో నేటికి సజీవంగా ఉన్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని తెలిపారు. వ్యవసాయం అంటే దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే విధంగా మార్చారన్నారు. కార్యక్రమంలో ఇసాక్, భాస్కర్‌యాదవ్, ఎల్లప్ప, పులిపాటి వెంకటేష్, కృష్ణమూర్తి, సురేష్, రామకృష్ణ, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.