
‘సర్వేపల్లి’ జీవితం ఆదర్శం
వనపర్తి: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తించి జిల్లాను విద్యాపరంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శం కావాలని.. తన పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకోవాలని సూచించడం ఉపాధ్యాయులకు గొప్ప గౌరవం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని.. అందులో భాగంగానే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కొత్త టీచర్ల నియామకం చేపట్టిందని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తోందన్నారు. కొత్త విద్యా విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.