
మార్గదర్శకులు!
బోర్డుపై చిత్రాలు గీచి.. పాఠ్య పుస్తకాల్లోని ఫొటోలు చూపించి విద్యార్థులకు బోధించడం లాంటి మూసధోరణికి స్వస్తి పలికి.. సాంకేతికతను జోడించి పాఠ్యాంశాలను కళ్లకు కట్టేలా యానిమేషన్ వీడియోలు చూపిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు
కొందరు ఉపాధ్యాయులు. ఒక్కో పాఠ్యాంశం చాలా కాలం గుర్తుండేలా వినూత్న బోధన పద్ధతులతో విద్యార్థులకు బోధిస్తూ.. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి.. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా సంసిద్ధం చేస్తున్నారు. మొత్తంగా గ్రామీణ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – గద్వాల టౌన్
సైన్ ప్రయోగాలలో దిట్ట
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉపకరణాలతో ప్రయోగ పూర్వకంగా ధరూరు మండలం మార్లబీడు జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు ఎల్లస్వామి విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తున్నాడు. విద్యాభివృద్ధితో పాటు విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం పట్ల అభిరుచి కలిగి, పరిశోధనా, పరిశీలనాశక్తి, శారిస్తీయ నైపుణ్యాలు అలవడేలా కృషి చేస్తున్నారు. పాఠశాలలోని ఓ గదిలో సైన్స్‌కు సంబంధించిన వివిధ అంశాలతో ప్రయోగాలను ఏర్పాటు చేశారు. ఇందులో మానవ శరీరంలోని అవయవాలు, రక్త నమూనాలు మొదలుకొని వాటి పనితీరు వివిధ అంశాలపై క్షుణ్ణంగా చార్టులు, నమూనాల ద్వారా ప్రదర్శించారు. పాఠ్యంశాల్లోని అంశాలనే వివిధ ఉపకరణాల ద్వారా ప్రయోగపూర్వకంగా బోధిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2022లో ఎల్లస్వామి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2017 తొలి తెలంగాణ ప్రతిభ అవార్డు కింద రూ.50 వేలు నగదు పురస్కారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా అందుకున్నారు. నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు పలు అవార్డులను ఎల్లస్వామి అందుకున్నారు.
ఉపకరణాలతో బోధన భళా..
పాఠాల బోధన ఒక్కటే కాదు.. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులను ప్రేరేపించడమూ గురువుల బాధ్యతంటారు గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నాగరాజు. పిల్లల్లో అన్వేషణ సామర్థ్యం, అందుకు అవసరమైన జిజ్ఞాస మెండుగా ఉంటుందని నమ్మి.. వినూత్న బోధనోపకరణాలు వినియోగించి పాఠాలు బోధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలో డిజిటల్ బోర్డులను సమర్ధవంతంగా వినియోగిస్తున్నారు. స్వతహాగా పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలు రూపొందించి బోధన అందిస్తున్నారు. విద్యార్థులకు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు. సొంతంగా బోధనోపకరణాలు, ప్రాజెక్టులు తయారు చేయడంతో పాటు విద్యార్థుల చేత చేయిస్తున్నారు. 2022లో, 2024లో దక్షిణ భారత స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో బహుమతులు సాధించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మెటీరియల్స్ రూపొందించండం, పోటీ పరీక్షలకు విద్యార్థులకు తర్పీదు ఇస్తున్నారు.
బాల మేధావులుగా తీర్చిదిద్దుతూ..
ఉండవెల్లి: విద్యార్థుల మేధోశక్తికి పదును పెడుతూ.. కొత్త కొత్త ఆలోచనలకు కార్యరూపం దాల్చుతూ.. వారిని భవిష్యత్ సైంటిస్టులుగా తీర్చిదిద్దాతున్నారు ఉండవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు లక్ష్మి ఖర్చు లేకుండా, సులువుగా దుస్తులు తయారు చేసే యంత్రాన్ని విద్యార్థులచే తయారు చేయించి సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శించడంతో రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.ఎన్‌ఆర్‌ఐల సహాయంతో కొందరు విద్యార్థులను ఇస్రోకి తీసుకెళ్లి సైన్స్‌పై మరింత మక్కువ పెంచారు. మెదడుకు పదును పెట్టే చెస్ బోర్డులను అందజేశారు. ఇదే పాఠశాలలో 2007–08లో పదో తరగతి చదివిన కృష్ణ అనే విద్యార్థి ప్రస్తుతం ఇస్రోలో విధులు నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో సైన్స్ టీచర్ లక్ష్మీ వల్లే సైన్స్‌పై మక్కువ పెరిగిందని, ఈ రంగంవైపు వచ్చానని పూర్వ విద్యార్థి కృష్ణతోపాటు పలువురు చెప్పుకొచ్చారు.
తెరపై చూపుతూ...
విజ్ఞానం వెలిగిస్తూ..
చెప్పడం కంటే చూపిస్తే పిల్లలకు పాఠాలు సులభంగా అర్థమవుతాయన్నది నిజం. గత కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని పాటిస్తున్నారు ఉండవెల్లి మండలం పుల్లూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడి రవిశంకర్. తన సబ్జెక్టు పాఠాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్, యూనిమేషన్ వీడియోలు సొంతగా రూపొందిస్తున్నారు. టీవీ, కంప్యూటర్ల ద్వారా విద్యార్థులకు వీటిని చూపిస్తూ, వివరిస్తూ బోధిస్తున్నారు. దీనికే పరిమితం కాకుండా పాఠ్యాంశాలపై విద్యార్థుల చేత ప్రయోగాలు చేయిస్తుంటారు. అందులో భాగంగా జీవశాస్త్ర సంఖ్యా క్యాలెండర్, జీవశాస్త్ర వైకుంఠపాళి, జీవశాస్త్ర పదవినోదం లాంటి వినూత్న అంశాలతో బోధనను కొనసాగిస్తూ రాష్ట్రస్థాయిలో అందరి మన్ననలను పొందుతున్నారు. ఇటీవల ఎన్‌సీఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యా అమృత్ మహోత్సవంలో వర్చువల్ రియాలిటీ ‘సాంకేతిక పరిజ్ఞానంతో జీవశాస్త్ర బోధన’ అనే అంశం రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికై ంది. ప్రయోగత్మాకంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులపై 3డీలో చూపుతూ బోధన చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సెమినార్లు, పోటీలలో పాల్గొని సత్తా చాటారు. వినూత్నంగా రూపొందించిన జీవశాస్త్ర సంఖ్యా క్యాలెండర్–2021కు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో స్థానం దక్కింది. దీంతోపాటు అధునాతన సాంకేతికను జోడించి ప్రత్యేకంగా ఓ యాప్‌తో తన సెల్‌ఫోన్‌ను ప్రొజెక్టర్‌కు అనుసంధానించి స్క్రీన్‌పై బొమ్మను చూపిస్తూ విద్యార్థులకు పాఠ్యంశాలను అర్థమయ్యేలా బోధిస్తున్నారు. అంతేకాక నూతన జాతీయ విద్యా విధానం–2020కి సంబంధించిన పలు అంశాలతో తెలుగులో డిజిటల్ పోస్టర్‌ను రూపొందించి జాతీయస్థాయి గుర్తింపు సాధించారు. వీటితో పాటు వివిధ అంశాల్లో ప్రావీణ్యం సాధించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు.
సృజనాత్మకత జోడించి ఆకట్టుకునేలా కృత్యాధార బోధన
అన్ని రంగాల్లో విద్యార్థులను
తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ
ఉపాధ్యాయులు
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

మార్గదర్శకులు!

మార్గదర్శకులు!

మార్గదర్శకులు!