
ఉత్సాహంగా కళాఉత్సవ్ పోటీలు
గద్వాలటౌన్: పల్లెజీవనం ప్రతిబింబించే నృత్యాలు.. సంస్కృతిలో ఆచార వ్యవహారాల ప్రదర్శనలు.. శాసీ్త్రయ జానపద నృత్యాలు ఇలా ఎన్నో భారతీయ కళలు ఉట్టిపడేలా జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు సాగాయి. విద్యాశాఖ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రెండోరోజు గురువారం స్థానిక బాలభవన్‌లలో జరిగిన జిల్లాస్థాయి పోటీలను డీఈఓ అబ్దుల్ ఘనీ పరిశీలించారు. జానపద నృత్యాలు, నాటికలు, బుర్రకథలు, చిత్రలేఖనం తదితర విభాగాలలో పోటీలు జరిగాయి. ఆయా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకొని న్యాయ నిర్ణేతల మెప్పు పొందారు. సందేశాత్మకమైన అంశాలతో పలువురు విద్యార్థులు నాటికలు నిర్వహించి మెప్పు పొందారు. బుర్ర కథలతో ఆకట్టుకున్నారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి డీఈఓ అబ్ధుల్‌ఘనీ మాట్లాడారు. సాంస్కృతిక కార్యక్రమాలతో మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సిద్దిస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తి వెలికితీయడానికి కళా ఉత్సవ్ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా సమన్వయ అధికారిణి ఎస్తేర్‌రాణి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై ంది వీరే
గాత్ర సంగీతం సోలో విభాగంలో గద్వాల మైనార్టీ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థిని తస్లీమ్, గాత్ర సంగీతం గ్రూప్ విభాగంలో గద్వాల బాలురు గురుకుల పాఠశాలకు చెందిన నాని బృందం ప్రథమ స్థానంలో నిలిచారు. సంగీతం సోలో విభాగంలో అగస్త్య పబ్లిక్ స్కూల్‌కు చెందిన వీవేక్ వర్థన్, గ్రూపు విభాగంలో గద్వాల బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన కర్రెప్ప, రవి, దర్మ, మల్లికార్జున్ బృందం మొదటి స్థానంలో నిలిచారు. శాసీ్త్రయ నృత్యం సోలో విభాగంలో ఎస్‌ఎస్‌వీఎం స్కూల్‌కు చెందిన విద్యార్థిని జ్యోత్స్న, శాసీ్త్రయ నృత్యం గ్రూప్ విభాగంలో విశిష్ట నోబుల్ స్కూల్‌కు చెదిన హరిణి బృందం మొదటి స్థానంలో నిలిచారు. చిత్రలేఖనం, పెయింటింగ్ విభాగంలో మాంటిస్సోరి స్కూల్ విద్యార్థి ఆయేషా ఆమ్రీన్, థియేటర్ విభాగంలో గద్వాల విద్యార్థి ఉదయ్‌కిరణ్ ప్రథమ స్థానంలో నిలిచారు. దృశ్య కళలు 2డీ సోలో విభాగంలో కొట్టం మాణిక్యమ్మ కళాశాల విద్యార్థిని సుదేక్ష నిలిచారు.